మహా : హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న ట్రాన్స్ జెండర్లతో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశా నికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆరు నెలల క్రితం ప్రయోగాత్మకంగా 44 మందిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. దేశంలో మొట్ట మొదటిసారిగా ట్రాఫిక్ అసిస్టెంట్ గా ట్రాన్స్ జెండర్లను తీసుకుంది. కేవలం పది రోజుల్లోనే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్ లను నియమించి తెలంగాణ సర్కార్ రికార్డు సృష్టించింది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ట్రాన్స్ జెండర్లు అంటే సమాజంలో చిన్న చూపు ఉందన్నారు. కానీ దాన్ని అధిగమించి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు తమ సత్తాను చాటారని అభినందించారు. ట్రాన్స్ జెండర్లకు అవకాశాలు కల్పిస్తే రాణిస్తామని ట్రాఫిక్ అసిస్టెంట్లు నిరూపించారన్నారు. గత ఆరు నెలల్లో సకాలం లో విధులకు హాజరై తమ అంకిత భావాన్ని ప్రదర్శించారని తెలిపారు. ఎంతో క్లిష్టమైన ట్రాఫిక్ డ్యూటీని క్రమశిక్షణతో నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క రిలో సమర్థత ఉంటుందని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న ట్రాన్స్ జెండర్లు గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నారన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లను నియమించామని, ఈ విషయాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ లో ప్రత్యేకంగా ప్రస్తావించానని మంత్రి సీతక్క వెల్లడించారు.
తెలంగాణ మోడల్ ను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయని మంత్రి తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందని, ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు తమను తాము నిరూపించుకున్నారన్నారు. పోలీస్ శాఖలోనే కాకుండా ఇతర శాఖలో కూడా ట్రాన్స్ జెండర్లను నియమించే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, ఎక్కడ ట్రాన్స్ జెండర్ల మీద వివక్షత లేకుండా అన్ని రంగాల్లో వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు.








