మహా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలో ఇంత ఆవేదనతో ఉంది అనే విషయం ఇప్పుడే తెలిసిందని, ఆమె వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతుందని ఆ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన చిట్‌చాట్‌గా మీడియాతో మాట్లాడారు. కవితకు షోకాజ్ నోటీసు ఎలా ఇస్తామని, కవితతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని, ఆమె సమస్యపై పార్టీలో తొందరలోనే కొలిక్కి వస్తుందని అనుకుంటున్నానని వెల్లడించారు. రాజకీయాల్లో ప్రకంపనలు సహజమని తెలిపారు. చాలా పార్టీల్లో ఇలాంటి ప్రకంపనలు చూశామని అన్నారు. తమ పార్టీ మొదటిది కాదని.. చివరిది కాదని చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో కరుణానిధి, అళగిరి, కనిమొళి ఫ్యామిలీల రాజకీయాలు చూశామని అన్నారు. ఎమ్మెల్సీ కవితలో అంత ఆవేదన ఉన్న విషయం ఇప్పుడే చూశానని చెప్పారు. పార్టీలోని సమస్యలు త్వరలోనే ఖచ్చితంగా సద్దుమణుగుతాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి పనిచేసిందని గుర్తుచేశారు. ఒక్క బీజేపీతో మాత్రమే పని చేయలేదని, ఆ పార్టీతో కలిసి పని చేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునేవాళ్లమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.








