వ్యవసాయంలో “నయా భారత్” నవశకం: విధానాల స్థాయి నుండి ఆచరణాత్మక ఫలితాల దాకా..!
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు వ్యవసాయమే వెన్నెముక. అయితే, ఈ రంగాన్ని ముందుకు నడిపించాల్సిన పరిశోధనలు కేవలం ప్రయోగశాలలకే పరిమితమైతే ఆశించిన ఫలితాలు సాధించలేము. ఈ వాస్తవాన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా “కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్” చొరవతో “ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్)” వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించవచ్చు. సిద్ధాంతాలకే పరిమితమైన “కాగితపు పరిశోధనల” యుగానికి ముగింపు పలికి, ‘ల్యాబ్ టు ల్యాండ్’ అంటే ప్రయోగశాల నుంచి పొలానికి.. అనే నినాదాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావడం ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం.
ఈ నూతన విధానం పట్ల ఒక సమగ్ర విశ్లేషణ ఇది..గతంలో శాస్త్రవేత్తల ప్రమోషన్లు ప్రధానంగా వారు ప్రచురించిన థియరీ పేపర్లు, సాధించిన అవార్డుల మీద ఆధారపడి ఉండేవి. దీనివల్ల క్షేత్రస్థాయిలో రైతు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇంటర్వ్యూలలో సిఫార్సుల ప్రభావం ఎక్కువగా ఉండేది. ప్రొఫెసర్ వేద్ ప్రకాష్ కమిటీ సిఫార్సులతో ఈ పరిస్థితి పూర్తిగా మారనుంది. మార్కుల నిష్పత్తిని స్థిరీకరించడం ద్వారా ఇంటర్వ్యూలలో జరిగే పక్షపాతానికి చెక్ పడింది. ఇది నిజాయితీగా కష్టపడే యువ శాస్త్రవేత్తలకు సమాన అవకాశాలు కల్పించే అత్యుత్తమ నిర్ణయం.
ఈ సంస్కరణల వల్ల అత్యంత లబ్ధి పొందేది ప్రతిభావంతులైన, చిత్తశుద్ధితో పనిచేసే యువతే. మారుమూల, సవాలుతో కూడిన ప్రాంతాలకు వెళ్లి రైతుల కోసం పనిచేసే శాస్త్రవేత్తలకు “రిమోట్ ఏరియా బోనస్” పేరుతో అదనపు మార్కులు ఇవ్వడం ఈ విధానంలో అత్యుత్తమమైన అంశం. ఏసీ గదుల్లో కాకుండా క్షేత్ర స్థాయిలో, వాస్తవ విషయాలకు అనుగుణంగా పనిచేసే యువత శ్రమకు ఇకపై సరైన గుర్తింపు లభిస్తుంది.
పాత విధానం వ్యక్తి-కేంద్రకృతంగా ఉండేది. శాస్త్రవేత్తల డిగ్రీలు, వ్యక్తిగత విజయాలు ఆధారంగా పెద్ద పదవులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు దానిని పదవి-కేంద్రకృతంగా.. అంటే రోల్ సెంట్రిక్ గా మార్చారు. వ్యక్తిగత పలుకుబడిని కాకుండా, ఆ పదవికి తగిన బాధ్యతలను క్షేత్రస్థాయిలో ఎంత సమర్థవంతంగా నిర్వర్తించారనేదే ఇకపై ప్రామాణికం కానుంది. ఇది నిజమైన మెరిట్ ఆధారిత వ్యవస్థకు పునాది.
చెరకులో వచ్చే ఎర్రకుళ్లు తెగులు అంటే రెడ్ రాట్, పత్తిని నాశనం చేసే గులాబీ రంగు పురుగు అంటే పింక్ బోల్ వార్మ్, ఉల్లి, మామిడి, లీచీ లాంటి పంటల నిల్వ సామర్థ్యం అంటే షెల్ఫ్ లైఫ్.. ఇటువంటి విషయాలు రైతులను ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యలు. విదేశీ విధానాలను కాపీ-పేస్ట్ చేయడం లేదా విత్తనాలు మార్చడం వంటి తాత్కాలిక పరిష్కారాల వల్ల ప్రత్యామ్నాయంగా రైతులు కూడా విరివిగా బహుళజాతి కంపెనీల వ్యవసాయ రసాయనాలు వాడటమే అలవాటు చేసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల, శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను నేరుగా స్థానిక రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్రీకరిస్తారు. దీని ద్వారా దేశీయ వాతావరణానికి సరిపోయే, స్థిరమైన బయోలాజికల్ అంటే జీవసంబంధిత పరిష్కారాలు కనుగొనే అవకాశం ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులు, నీటి ఎద్దడి, భూసార క్షీణత వంటివి వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్న విషయాలు. ఇటువంటి గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవాలంటే ప్రాక్టికల్ రీసెర్చ్ అంటే ఆచరణాత్మక పరిశోధన అత్యవసరం.
కేవలం ప్రొఫైల్ పెంచుకోవడానికి థియరీ పేపర్లు ప్రచురించే పద్ధతిని నిలిపివేయడం, థియరీలకే పరిమితం కాకుండా, శాస్త్రవేత్తలను ల్యాబ్‌ల నుంచి బయటకు తీసుకువచ్చి రైతులు మరియు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ప్రయోగాలు జరగాలని, ప్రాక్టికల్ రీసెర్చ్ చేసేలా ప్రభుత్వం నిర్దేశించడం ప్రోత్సహించడం ద్వారా, భారత వ్యవసాయ రంగం అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిలబడుతుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కఠినమైనదే, కానీ అత్యంత ఆవశ్యకమైన నిర్ణయం.. వ్యవసాయ పరిశోధనా రంగంలో పేరుకుపోయిన పాత పద్ధతులకు స్వస్తి పలికి, పూర్తిగా ప్రక్షాళన చేస్తుంది. పదవులు, ప్రమోషన్లు అనేవి కేవలం హోదాలు కావు, అవి రైతుల పట్ల నెరవేర్చాల్సిన బాధ్యతలు అనే బలమైన సందేశాన్ని ఈ విధానం ఇస్తోంది. ఇది భారతీయ రైతులకు భరోసానివ్వడమే కాకుండా, నైపుణ్యం, నిజాయితీ కలిగిన యువ శాస్త్రవేత్తలకు వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు ఒక అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసింది. దేశ పురోగతికి ఇదొక స్వాగతించదగిన పరిణామం.
(శివ కుమార్ గనివాడ, సీనియర్ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ ఎక్స్‌పర్ట్)







