“గోబర్-ధన్” పథకం..పల్లె ప్రగతికి కొత్త ఇంధనం!
”నయా భారత్” పర్యావరణ భద్రత, ఉపాధి సృష్టి దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘గోబర్-ధన్’ పథకం భారత దేశ స్వచ్ఛ ఇంధన విప్లవానికి సరికొత్త ఊపునిస్తోంది. పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాలను ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ మరియు ‘సేంద్రియ ఎరువులు’గా మార్చడం ద్వారా “వ్యర్థాల నుంచి సంపద” సృష్టించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనకు ఒక కీలకమైన ముందడుగు.
“గోబర్-ధన్” అంటే ”గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-ఆగ్రో రీసోర్సెస్ ధన్”. గ్రామీణ ప్రాంతాలను బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చడానికి, గ్రామస్తుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని 2018లో ప్రారంభించింది. భారతదేశ భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకం కింద కేంద్ర మంత్రివర్గం ఇటీవల భారీ కేటాయింపులు చేసింది.
2026-27 ఆర్ధిక సంవత్సరం నుండి 2035-36 వరకు పదేళ్ల కాలానికి కంప్రెస్డ్ బయోగ్యాస్ (సిబిజి) ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఏకంగా 23 వేల 731 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రభుత్వం ఆమోదించింది.
రాబోయే పదేళ్లలో దేశీయ సిబిజి ఉత్పత్తిని పది రెట్లు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు, కనీసం 10 సంవత్సరాల ఫ్రేమ్‌వర్క్ కింద ఎమ్.ఎమ్.బి.టి.యు కి అంటే మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ కి 2 వేల 110 రూపాయల చొప్పున స్థిరమైన ధరను నిర్ణయించారు.
రవాణా రంగంలో ఉపయోగించే సి.ఎన్.జి, గృహ అవసరాలకు వాడే పి.ఎన్.జి లలో సి.బి.జి వినియోగాన్ని క్రమంగా పెంచనున్నారు. 2026-27 ఆర్ధిక సంవత్సరం నాటికి 3%, తదుపరి 2027-28 నాటికి 4% అలాగే 2028-29 నాటికి 5% వరకు సిబిజి కలపడం తప్పనిసరి చేసారు.
ఈ పథకం ఇంధన రంగాన్ని, వ్యవసాయాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమగ్రంగా అనుసంధానం చేస్తోంది. వ్యర్థాల నుంచి తయారయ్యే కంప్రెస్డ్ బయోగ్యాస్ ఒక స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధనం. ఇది సహజ వాయువుతో సమానమైన రసాయన లక్షణాలను కలిగి ఉండటం వల్ల, ప్రస్తుతం ఉన్న గ్యాస్ నెట్‌వర్క్‌లలో సులభంగా వినియోగించవచ్చు. దీనిద్వారా ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది.
బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియలో ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యుర్ వెలువడుతుంది. ఈ సేంద్రియ ఎరువు నేల సారాన్ని పెంచడం, సేంద్రియ వ్యవసాయంలో రైతులకు మద్దతుగా నిలవడంలో అద్భుతంగా సహాయపడుతుంది. వ్యర్థాల సేకరణ, రవాణా, ప్లాంట్ల నిర్వహణ, ఎరువుల విక్రయం ద్వారా రైతులకు, ఎంఎస్ఎంఈ లకు, స్థానిక వ్యాపారులకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లో ఉపాధి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.
పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య భద్రత లో భాగంగా గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి ఈ పథకం ఉపకరిస్తుంది. ఇంటి లోపల అపరిశుభ్రమైన వంట చెరకు వాడటం వల్ల జరిగే మరణాలను తగ్గించి, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల ఆరోగ్యాన్ని ఇది రక్షిస్తుంది.
‘గోబర్-ధన్’ అఫిషియల్ యూనిఫైడ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ గణాంకాల ప్రకారం ఆగస్టు 2026 నాటికి, క్షేత్రస్థాయిలో ఈ పథకం వేగంగా అమలవుతోంది.. దేశవ్యాప్తంగా 1,751 బయోగ్యాస్ ప్లాంట్లు రిజిస్టర్ కాగా, అందులో 1,286 ప్లాంట్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. మరో 99 ప్లాంట్ల నిర్మాణం పూర్తయింది.
భారీ సామర్థ్యం ఉన్న 1,215 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు పోర్టల్‌లో నమోదు చేసుకోగా, వాటిలో 163 ప్లాంట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. మరో 253 ప్లాంట్ల నిర్మాణం కొనసాగుతోంది.
‘గోబర్-ధన్’ పథకం ద్వారా వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం కేవలం పర్యావరణానికే కాకుండా, స్థిరమైన ఆర్థిక వృద్ధి అంటే సర్కులర్ ఎకానమీ కి ఒక బలమైన పునాది వేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలు, విధానపరమైన మద్దతు కారణంగా, రాబోయే రోజుల్లో స్వచ్ఛ ఇంధన రంగంలో భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలవనుంది.
(శివ కుమార్ గనివాడ, సీనియర్ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ ఎక్స్‌పర్ట్)






