Mahaa Daily Exclusive

  పైరవీలు చేయొద్దు.. పేదవాళ్లకే ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం – భట్టి విక్రమార్క..!

Share

మహా: రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఈ ఏడాది ధాన్యం పండించారని, 65 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతాంగం పండించారని తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎంతోపాటు ఇంచార్జ్ మంత్రులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలబడిందని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతాంగానికి వారం రోజుల్లో వారి ఎకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ విజయమని, రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రూ. 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి ఒకేసారి 3,500 కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నిరంతరం ఇళ్ల మంజూరు ప్రక్రియ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో పేదలతో ఆడుకున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో నాలుగు లక్షల 50 వేల ఇళ్లు మంజూరు చేసి పేదలకు అందజేస్తున్నామని చెప్పారు.
ప్రజలకు హామీ ఇచ్చాం..
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేయాలన్నారు. చిన్న పొరపాటు కూడా జరగడానికి వీల్లేదని చేశారు. ఇదోక మహత్తర కార్యక్రమం అని, ఇంత గొప్ప కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేదలందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. రాష్ట్రంలో రైతన్నకు విత్తనాలు అందజేసే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, నకిలీ విత్తనాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో రైతాంగానికి, ప్రజలకు హామీ ఇచ్చామని, గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిని రద్దు చేస్తామని స్పష్టంగా చెప్పామన్నారు. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ధరణిని రద్దుచేసి ఆనాదిగా వస్తున్న దుర్మార్గపు చట్టాలను తొలగించి సరికొత్త భూ భారతి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చామన్నారు. జూన్ 2న ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున సంబరాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
ఇది ప్రజా ప్రభుత్వం..
ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మళ్లీ రిపీట్ కావద్దని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగొద్దని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇన్చార్జి మంత్రులతో కలిసి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని, జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై అధికారులతో చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. సీజనల్ వ్యాధుల దగ్గర నుంచి ఇందిరమ్మ ఇళ్ల వరకు ప్రతి ఒక్క అంశంపై చర్చ జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నామని, అధికారులకు స్పష్టమైన ఆదేశాలిస్తున్నామన్నారు. రైతాంగానికి ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగడానికి వీల్లేదని, ఇది ప్రజా ప్రభుత్వమని, పేదల ప్రభుత్వమని చెప్పారు. చిన్న చిన్న భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు సరదాల కోసం ఉద్యోగాలు చేయొద్దని స్పష్టం చేశారు. ఇది పేదల ప్రభుత్వం, అలసత్వం వహిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూలో ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని సూచించారు. ఫారెస్ట్ అధికారులు సంయమనం పాటించాలని తెలిపారు. గిరిజన రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దు, ఒక్క కొత్త చెట్టు కూడా నరక నివ్వొద్దని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ అధికారం ఉన్నా రాష్ట్రాలలో కూడా ఇంటికి 5 లక్షలు ఇవ్వడం లేదని, పేదవాడికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, పైరవీలు చేయవద్దని తెలిపారు.
కార్పొరేటర్ స్థాయిలో పేదలకు వైద్యం..
ఖమ్మం జిల్లాకు ముగ్గురు వర్చ్యువల్ మంత్రులున్నారని, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాసుపత్రులలో వైద్య సేవలు మెరుగుపరిచి పేదలకు మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని చెప్పారు. కార్పొరేటర్ స్థాయిలో పేదలకు వైద్యం అందించాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెరిగిందని, మాత శిశు ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.