మహా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నాక్ ఔట్ మ్యాచ్‌లో బయటికి వచ్చారని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎప్పుడైనా బీజేపీలోకి వెళ్లొచ్చని జోస్యం చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ అక్రమ సంబంధం బయటపెట్టిన కవితకు కృతజ్ఞతలు అంటూ సెటైర్లు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని వారి పార్టీ గెలిపించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ చరిత్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లీడర్లు నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఏ మేరకు దుబార ఖర్చు చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా మాధ్యమాలు, వాళ్లు అనుబంధ మీడియా సంస్థలు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక గాలిమోటరు కొంటున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో రాజకీయాలు చేస్తానని, దేశమంతా స్పెషల్ ప్లైట్‌లు వేసుకొని తిరిగిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీకి ఉన్నదన్నారు. కమీషన్లతో వందల కోట్ల రూపాయలతో గాలి మోటార్లు కొనుక్కున్నటువంటి శక్తికి బీఆర్‌ఎస్ పార్టీ ఎదిగిన సంగతి అందరికి తెలుసని కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం పవర్‌లోకి వచ్చాక అలాంటి ఖర్చులన్నీ తగ్గించేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాధారణ మనిషిలా ఇండిగో ఎకానమీ క్లాస్‌లో వెళ్తున్నారని గుర్తు చేశారు. కాస్మోటిక్స్ చార్జీలు, డైట్ చార్జీలు, ఉద్యోగాలు, ప్రజల ఆరోగ్యం వంటి ప్రాధాన్యలతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.








