మహా: రేవంత్ సర్కార్ ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 పట్ల సినీ ప్రముఖుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ అవార్డుల ప్రకటనపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువారం ఎక్స్ వేదికగా అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా అవార్డుల సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి తన సందేశంలో, ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌కు ఎంపికైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు నిజంగా ఎంతో విలువైనది. సృజనాత్మక రంగంలో ఉన్న ప్రతి నటుడికి, సాంకేతిక నిపుణుడికి ఇది ఎంతో ప్రేరణనిస్తుంది’ అని పేర్కొన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ అవార్డుల సంప్రదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించడం గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, సంబంధిత శాఖ మంత్రులకు, అధికారులకు, అవార్డుల కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.








