మహా: రాజన్న కోడెలపై రాజకీయమొద్దని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో వేములవాడ టెంపుల్‌కు ఏం చేశారో చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేములవాడ టెంపుల్‌కి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని నిలదీశారు. హామీ ఇచ్చిన నిధులు కేటాయించకపోవడం వల్లనే వేములవాడలో రాజన్న కోడెలకు ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఈ కోడెల దుస్థితికి పాపం కేసీఆర్ పాలనదేనని అన్నారు. అయితే, కోడెల ఘటన జరిగిన వెంటనే తమ ప్రభుత్వం స్పందించిందని అన్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోని ముందుకు వెళుతున్నట్టు చెప్పారు. అయినా, ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో బురద రాజకీయం చేయడం సరికాదన్నారు. శుక్రవారం ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తమ హయాంలో సక్సెస్ ఫుల్‌గా సరస్వతీ పుష్కరాలు నిర్వహించామన్నారు. పుష్కరాలకు 30 లక్షల మంది భక్తులు వచ్చినా ఎక్కడా చిన్న ఇబ్బంది జరగకుండా నిర్వహించామన్నారు. ఇక భద్రకాళి టెంపుల్ విస్తరణ పనులు కోట్లాది రూపాయలతో చేపట్టామన్నారు. యాదగిరిగుట్ట మీద కేసీఆర్ బొమ్మలను చెక్కించుకున్న వాళ్ళకి అసలు దేవుళ్ళ విషయంలో మాట్లాడే అర్హత ఉందా? అని సురేఖ ప్రశ్నించారు. యాదగిరిగుట్టకి తాము రూ. 63 కేజీల బంగారంతో గోపురం తాపడం చేయించామన్నారు. సామూహిక కోటి దిపోత్సవం, పలు నదీ హారతి కార్యక్రమాలు, కాళేశ్వరం, యాదగిరిగుట్టలకు మహా కుంభాభిషేకం చేశామన్నారు. అసలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఏనాడైనా చేశారా? దేవాదాయ శాఖలో డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగిందా అంటూ నిలదీశారు.ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ నాయకుల మాటలు, స్పందనలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అవి చూస్తే తనకు ఒకటే గుర్తుకు వస్తుందని అన్నారు.
దుస్థితికి కారణం వాళ్లే..
పాము శివుడిపై ఒట్టేసిందట ఇంకెవరిని కాటు వేసి చంపనని.. ఒక రాబందు మాట ఇచ్చిందట… ఇంకెప్పుడూ చచ్చిన పశువులను పీక్కు తిననని.. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిదట… తోటి జంతువులను సంహారించనని.. ఈ కట్టు కథలు కల్వకుంట్ల కుట్రలను మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు వినాలా? విని నమ్మాలా? అంటూ మంత్రి సురేఖ ప్రశ్నించారు. గత పదేండ్ల పాటు రాష్ట్ర సంపదను ఇష్టారీతిన దోచుకున్న కల్వకుంట్ల దండుపాళ్యం బ్యాచ్.. నేడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంటే విషపురుగులై.. విషసర్పాలై… రాబంధులై… ఉద్వేగం పేరుతో మనల్ని ఉన్మాదులను చేసే కుట్రకు పాల్పడుతుండటం బాధాకరమన్నారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత గొడవలతో బీఆర్ఎస్ నాయకులకు ఏం మాట్లాడాలో.. ఏ విధంగా స్పందించాలో అర్థం కావడం లేదన్నారు. వేములవాడలో గోశాలకు ఈ దుస్థితికి రావడానికి కారణం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా అని బీఆర్ఎస్ నేతలు ఆత్మ సమీక్ష చేసుకోవాలన్నారు. వేములవాడ రాజన్న దగ్గర మొక్కులు మొక్కి రూ.100 కోట్లు ఇస్తానని దేవుడిని మోసం చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్‌ది కాదా? అని ఆమె ప్రశ్నించారు. అప్పుడు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు వేములవాడకు వంద కోట్లు ఖర్చు పెడితే గోశాల కూడా బాగుపడేది కదా సురేఖ చెప్పుకొచ్చారు. కోడెల మొక్కులు, కోడెలు సమర్పించుకోవటం భక్తుల నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిందన్నారు. వాటిని కూడా రాజకీయం చేయటం బీఆర్ఎస్ పార్టీ నీచ రాజకీయానికి, ఆ పార్టీ నాయకుల నీచ మనస్తత్వానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. కేసీఆర్ పదేండ్ల అరిష్టపు పాలన ఇప్పటికీ వేములవాడను వెంటాడుతోందన్నారు. ఆ పాపం బీఆర్ఎస్ పార్టీని కూడా వెంటాడుతుందని, అందుకే ఆ పార్టీలో లుకలుకలు తెరపైకి వస్తున్నాయన్నారు. తమ నాయకు రేవంత్ రెడ్డి అన్న సీఎం అయ్యాక వేములవాడకు మాస్టర్ ప్లాన్ ఆమోదించుకున్నామని, వేములవాడ అభివృద్ధికి నిధులు ఇచ్చామన్నారు. రాజన్న టెంపుల్ విస్తరించేందుకు వేగంగా చర్యలు చేపట్టామని గుర్తు చేశారు.







