మహా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఆయనపై నమోదైన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదైంది. అయితే, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం, ఈ పిటిషన్‌పై ప్రతివాదిగా ఉన్న కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేటీఆర్‌ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
మూసీ ప్రక్షాళన పేరుతో..
మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ గతంలో ఆరోపణలు చేశారు. దీంతో కేటీఆర్ చేసిన ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ.. ఉట్నూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత ఫిర్యాదుతో కేటీఆర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుగుణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరుగగా.. పిటిషన్‌పై సమాధానం చెప్పాలంటూ కేటీఆర్‌కు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.







