Mahaa Daily Exclusive

  తెలంగాణ నీటిహక్కుల కోసం.. తగ్గేదెలే బనకచర్లతో తెలంగాణకు అన్యాయమే ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం తేల్చిచెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

Share

హైదరాబాద్, మహా

బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అంతర్రాష్ట్ర జలవిధానాలకు, జీఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ నిబంధనలకు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్టు ఉందని ఆక్షేపించారు. తెలంగాణ నీటి హక్కులకోసం రాజీలేని పోరాటం చేస్తాం.. వెనక్కి తగ్గేదేలే . ఈ ప్రాజెక్టును తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం తెలుపుతూ కేంద్ర మంత్రులు సీఆర్‌ పాటిల్‌, నిర్మలా సీతారామన్‌కు లేఖలు రాశామని చెప్పారు. ఈ నిర్మాణం గురించి ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని, వస్తే అన్ని నిబంధనలు పరిశీలిస్తామని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ చెప్పినట్లు చెప్పారు. తాము చట్ట ప్రకారమే ముందుకెళ్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ వివరించారు. తాము రాసిన లేఖలో ఏపీ ఉల్లంఘనలను పూర్తిగా వివరించామన్నారు. చట్టవిరుద్ధంగా ఏపీకి కేంద్రం సహకరిస్తుందని అనుకోవట్లేదని, తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంత వరకైనా పోరాడుతామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని, వెనక్కి తగ్గేదేలేదన్నారు.

అప్పుడు నేతలు నాటకాలు ఆడుతున్నారు

బనకచర్లకు అనుమతులు ఇవ్వకుండా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కేంద్రాన్ని ఒప్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్​ చేశారు. కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే పదేళ్లు బీఆర్​ఎస్​ సహకరించిందని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో కృష్ణా నీటిలో తెలంగాణ వాటా 724 టీఎంసీలు ఏపీకి వెళితే, బీఆర్​ఎస్​ హయాంలో 1,254 టీఎంసీలు తరలించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జనవరి 22 న జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ రాశాను. మాకు ఏపి నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని.. వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామని.. మే నెలలో తెలంగాణకు పాటిల్ లేఖ రాశారు. చట్టప్రకారం ముందుకు వెళతామని పాటిల్ మాకు హామీ ఇచ్చారు. ఏపీ ఉల్లంఘనలను పూర్తిగా లేఖల్లో సవివరంగా వివరించాం. కేంద్రం .. చట్ట విరుద్ధంగా.. ఏపీకి సహకరిస్తుందని అనుకోవడం లేదు. తెలంగాణ కు అన్యాయం జరిగితే.. ఎంత వరకైనా పోరాడుతాం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి లు కేంద్రాన్ని ఒప్పించాలి అని అన్నారు.

కాళేశ్వరంలో వృధా ఖర్చు చేయకుంటే..

కాళేశ్వరంలో వృధా ఖర్చు చేయకుంటే.. కృష్ణా ప్రాజెక్టులు అన్ని పూర్తి అయ్యేవని, తమ్మిడి హట్టి దగ్గర కాకుండా..మేడిగడ్డ వద్ద కట్టడం ద్వారా 68 వేల కోట్లు కాళేశ్వరం అదనపు ఖర్చు అయ్యిందని, కృష్ణా లో తెలంగాణకు అన్యాయం చేసింది బి ఆర్ ఎస్ అన్నారు. 512 టీఎంసీ ఏపీకి.. తెలంగాణకు 299 టీఎంసీ చాలు అని సంతకం పెట్టింది బి ఆర్ ఎస్ ప్రభుత్వం కాదా..? అప్పుడు మోసం చేసి.. ఇప్పుడు బిఆర్ ఎస్ నేతలు నాటకాలు ఆడుతున్నారన్నారు. ముచ్చుమర్రి ప్రాజెక్ట్ పనులను బీఆర్ ఎస్ ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తెలంగాణకు మరణశాసనమన్నారు. ప్రతిరోజూ 3 టీఎంసీ తరలించేందుకు కెసిఆర్ సర్కార్ సహకరించింది నిజమన్నారు.