మణుగూరు ఏరియా మనుగడకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలనీ దీనికై కొత్త గనులతో పాటు ఉన్న గనులకు విస్తరణ అనుమతులు సాధించాలనీ కోరుతూ శుక్రవారం నాడు హైదరాబాదు మినిస్టర్స్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి వినతి పత్రం అందజేసినట్లు గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఐ ఎఫ్ టి యు)రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ డి నా సర్ పాషా విలేకరులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు ఏళ్లకు మించి మణుగూరు మనుగడ ముందుకు కొనసాగదని కొత్త గనులకు అనుమతులు రాకపోయినా మణుగూరు ఓసి విస్తరణ పనులు నిలిచిపోయినా మణుగూరు ఏరియా భవిష్యత్తు ప్రశ్నార్థకం కానున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మణుగూరు ఓసి విస్తరణలో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించాలని రైతుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించి గ్రామ సభలు విజయవంతం అయ్యేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా కొత్త బొగ్గు గనులు ప్రారంభం కాకపోతే తెలంగాణ వెలుగు రేఖ దక్షిణాది పరిశ్రమల ఆయువుపట్టు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణిపై నీలిమబ్బులు కమ్ముకొను న్నాయని సింగరేణి పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేయాలని కోరారు. విషయాన్ని ఎంతో ఓపికగా విని సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.







