రంగారెడ్డి జిల్లా మహా:
ప్రభుత్వ భూములను కాపాడి, భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని, అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సిపిఎం పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ కార్యదర్శి డి కిషన్ అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తుర్కయంజాల్, మన్నెగూడ రెవిన్యూ పరిధిలో గల ప్రభుత్వ భూములను, చెరువులు, కుంటలు, కాలువలను కాపాడాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణ దారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తూ అన్ని అర్హతలు కలిగి ఉండి ఇండ్ల స్థలాల కోసం అనేక దఫాలుగా అర్జీలు పెట్టుకున్న అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తుర్కయంజాల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన భూభారతి సదస్సులో అబ్దుల్లాపూర్మెట్ మండల ఎమ్మార్వో సుదర్శన్ రెడ్డికి మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం తుర్కయంజాల్ మున్సిపాలిటీ కార్యదర్శి డి కిషన్ మాట్లాడుతూ…. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోనీ తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను, చెరువులు కుంటలు కాల్వలను కాపాడడంలో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. తుర్కయంజాల్ రెవిన్యూ సర్వేనెంబర్ 52, 212, 279, 323, 399, 631, 637 తదితర ప్రభుత్వ రెవెన్యూ భూముల్లో, రాజకీయ పలుకుబడి కలిగిన కొంతమంది నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కుమ్మక్కై తప్పుడు కాగితాలను సృష్టించి, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి యదేచ్చగా వ్యాపారం చేసుకుంటున్నారని అన్నారు.
అన్యాక్రాంతమవుతున్న చెరువులు….
మన్నెగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 7, 8 , 9 ,10 లలో 3.5 ఎకరాల గంగరాయన్ చెరువు శిఖం భూముల్లో, ఎన్ఓసి తెచ్చుకున్నామని చెబుతూ కొంతమంది రియల్ వ్యాపారస్తులు చెరువును వెంచర్ చేసి ప్లాట్లు చేస్తున్నారని అన్నారు. దీనికిపైనే ఉన్న ఎర్రగుంట చెరువు కూడా రియల్ వ్యాపారుల కబంధహస్తాల్లో జిక్కి పూర్తిగా కనుమరుగవుతుందని అన్నారు. ఎంఎం కుంట పరిధిలో హార్డ్వేర్ పార్క్ కోసం తీసుకున్న ప్రభుత్వ సీలింగ్ గైరాన్, పోరంబోకు భూములను శాటిలైట్ ద్వారా సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఈ గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ అన్ని అర్హతలు కలిగి ఉండి ఇంటి స్థలాల కోసం అనేక దఫాలుగా ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ మీ సేవా కేంద్రాల్లో అర్జీలు పెట్టుకున్న అర్హులైన నిరుపేదలందరికీ 60 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు కాపాడకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలందరినీ సమీకరించి ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతి గుడిసెలు వేయిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ కమిటీ సభ్యులు ఎం సత్యనారాయణ, జె ఆశీర్వాదం, నాయకులు పి శ్రీనివాసులు, ఐ కృష్ణ, బి శంకరయ్య, ఎన్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.








