మహా: మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఈనెల 16న (సోమవారం) ఉదయం పది గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈ కేసుకు సంబంధించి గత నెల మే 28న విచారణకు హాజరుకావాల్సిందిగా మే 26వ తేదీన కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు పంపింది. అయితే ఆ సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగిసిన తర్వాత విచారణకు హాజరువుతానని ఏసీబీకి మాజీ మంత్రి సమాచారం ఇచ్చారు. దానికి అంగీకారం తెలిపిన ఏసీబీ.. తాజాగా మరోసారి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.
గతంలో ఒకసారి విచారణకు..
ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి గతంలో ఒకసారి కేటీఆర్ ఏసీబీ, ఈడీ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. జనవరి 6న లాయర్లతో కలిసి ఏసీబీ విచారణకు వెళ్లిన కేటీఆర్‌ను అధికారులు అనుమతించకపోవడం తిరిగి వెళ్లిపోయారు. తిరిగి మరోసారి జనవరి 8న ఏసీబీ విచారణ హాజరయ్యారు మాజీ మంత్రి. దీంతో దాదాపు 7 గంటల పాటు ఆయనను ఏసీబీ విచారించింది. జనవరి 9న మరోసారి విచారణకు పిలవగా.. కేటీఆర్ సమయం కోరారు. ఇక మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారించింది.
నిధుల దుర్వినియోగం..
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. అయితే ఇందులో రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురు పేర్లను ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసింది. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది ఏసీబీ. ఆ తరువాత జనవరిలో ముగ్గురిని వివిధ తేదీల్లో విచారించిన ఏసీబీ.. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించింది. మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని కూడా ఏసీబీ చెప్పింది. అలాగే గ్రీన్‌కో ఏస్ నెక్స్ట్‌జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌కు కూడా ప్రశ్నించింది. అయితే వీరి ముగ్గురిని విచారించి మూడు నెలలు గడిచిపోయింది కూడా. ఇప్పుడు తాజాగా రెండో సారి కేటీఆర్‌ను విచారించాలని ఏసీబీ నిర్ణయించింది.








