మహా: ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక స్థావరాలపై, అణు లక్ష్యాలపై దాడులు ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌ను ‘రైజింగ్ లయన్’ అని పేరు పెట్టారు. ఇరాన్ అణ్వాయుధాన్ని పొందేందుకు ఎన్నడూ లేనంత దగ్గరగా ఉంది, ఇరాన్ చేతిలోకి విధ్వంసం చేసే ఆయుధాలు వస్తే ఇజ్రాయెల్ కు, ప్రపంచానికి పెను ముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఇరాన్‌పై తొలి దశ సైనిక చర్య ముగిసిందని ఐడీఎఫ్ దళాలు తెలిపాయి. ఈ దాడులను ఇరాన్ కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో అనేకమంది మృతి చెందినట్లు ఇరాన్ మీడియా కూడా వెల్లడించింది. ఇరాన్ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కెర్మాన్‌షా, లోరెస్తాన్, టెహ్రాన్‌లలోని పలు ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరిగాయి.
మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతి..
దాడులతో ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ దేశ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి కూడా ఈ దాడిలో మృతి చెందినట్లు ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. దీనిని ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్‌ఎన్‌ఎన్ ధ్రువీకరించింది. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే ఇరాన్ టాప్ అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. వీరితోపాటు సైన్యంలోని సీనియర్ జనరల్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐఆర్‌జీసీ చీఫ్ హొస్సేన్ సలామీ కూడా ప్రాణాలు కోల్పోయారు.
ప్రతీకారం తీర్చుకొంటాం..
ఇజ్రాయెల్ చేసిన దాడులకు తాము ప్రతీకారం తీర్చుకొంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. టెల్‌అవీవ్‌కు తీవ్రమైన శిక్షను విధిస్తామన్నారు. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ తొలుత దాడులు చేసింది. ఆ తర్వాత శుక్రవారం ఉదయం రెండో దశ దాడులు ప్రారంభించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్‌లోని న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్ అవీవ్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఐదు విడతలుగా దాడులు చేసింది.








