Mahaa Daily Exclusive

  విక్టోరియా మెమోరియల్ పాఠశాలకు ఐదు కోట్ల నిధులు మంజూరు విక్టోరియా మెమోరియల్ హోమ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహ:
విద్యార్థుల భవిష్యతే రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం భావిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం ఆయన తన పుట్టినరోజు సందర్భంగా కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ ఆర్ ఫాన్స్ హోమ్ లో విద్యార్థులు, అధికారులు, స్థానిక నేతలను ఉద్దేశించి ప్రసంగించారు.
విద్య ద్వారానే మానవ వనరులు మెరుగుపడి తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడుతుందని డిప్యూటీ సీఎం అన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న విద్యారంగానికి ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి బిడ్డ ప్రపంచంతో పోటీపడేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను నిర్మిస్తున్నామని తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో 200 కోట్ల పెట్టుబడితో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం అన్నారు.
రాష్ట్రంలో మొదటి దశలో 11,600 కోట్లతో 100 పాఠశాలలు నిర్మిస్తున్నాం అన్నారు.
విలువైన విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుతాము అన్నారు. విక్టోరియా మెమోరియల్ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు వెంటనే ఐదు కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ట్రాన్స్కో శాఖలోని CSR ఫండ్స్ నుంచి ఈ కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. నిధులు వెంటనే విడుదల చేస్తాం, ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విక్టోరియా మెమోరియల్లో చదువుకుంటున్న అనాధ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest