ఆదిలాబాద్, మహా:
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం బీర్సాయి పేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా… మరొక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కాళేశ్వరం వెళ్లి ఆదిలాబాద్ వైపు తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని రిక్షా కాలనీ కి చెందిన ఈర్ల రాజు తన భార్య సృజనిత, కొడుకు హర్ష, కూతురు ఆద్య, అత్త విజయలతో కలిసి కాళేశ్వర దర్శనానికి వెళ్ళారు. అక్కడి నుండి తిరిగి వస్తుండగా ఉట్నూర్ మండలం బీర్సాయి పేట వద్ద కారు అదుపు తప్పి చెట్టును డీకొంది. ఈ ఘటనలో హర్ష, విజయ అక్కడికక్కడే మృతి చెందారు. రాజు, సృజనిత, ఆద్య లకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై మనోహర్ ఘటన స్థలం వద్ద వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్కడి నుండి క్షతగాత్రులను రిమ్స్ కు తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పర్యవేక్షించారు. ఆద్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కలిచివేశాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి తరలివచ్చారు. ఒకే కుటుంబం నుండి ఇద్దరు మృతి చెందడంతో బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం మృత దేహాలను జిల్లా కేంద్రానికి తరలించారు.








