రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
విద్యార్థులు లక్ష్యంతో చదవాలని విద్యతోనే భవిష్యత్తు తలరాత మారుతుందని ఎమ్మెల్యే కాలే యాదయ్య ఉన్నారు. నవాబ్ పేట్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య సందర్శించారు.
మొదటగా పాఠశాలలో అదనంగా నిర్మిస్తున్న తరగతి గదులను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పాఠశాల సిబ్బందితో, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, విద్యార్థులకు యూనిఫార్మ్స్, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు లక్ష్యంతో చదవాలని విద్యతోనే భవిష్యత్తు తలరాత మారుతుందని ఆయన విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకోవాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తూ నిధులు సమకూరుస్తూ, పాఠశాలల అభ్యున్నతికి ముందడుగులు వేయడం జరుగుతుందని, విద్యార్థులు ఇష్టపడి చదవాలని, ఒక ఉన్నత స్థానాన్ని ఎంచుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలని ఆయన విద్యార్థులను కోరారు. ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని, వారికి నాణ్యమైన విద్యను బోధించేలా ఉపాధ్యాయులు ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు సూచించాలని ఉపాధ్యాయులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








