రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
రైతులకు పంట మార్పిడిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, ఇతర ఉన్నత అధికారులతో కలిసి వర్చువల్ విధానం ద్వారా రైతు నేస్తం రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ… రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రైతులకు మరింత చేరువ అవుతుందని రాష్ట్రంలోని ఒక వెయ్యి 31 రైతు వేదికలను రైతు నేస్తం కార్యక్రమం ద్వారా చేయడం అనుసంధానం జరిగిందని, ఇందులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి మంగళవారం రాష్ట్రంలోని రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, వ్యవసాయ సాగులో అవసరమైన మెళకవలను అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులు నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశమై వ్యవసాయంలో సాంకేతిక వినియోగంపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా పథకంలో భాగంగా రాష్ట్రంలోని 1 కోటి 49 లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యభూములకు సంబంధించిన 70 లక్షల 11 వేల 984 మంది రైతుల ఖాతాలలో 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుందని, అర్హులైన రైతులందరికీ ఒకేసారి రైతుభరోసా అందించడం జరుగుతుందని తెలిపారు.
రైతు సంక్షేమంలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, నిరుపేద రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించేందుకు వ్యవసాయ సాగులో సన్నరకం వడ్లకు మద్దతు ధరతోపాటు 500 రూపాయల బోనస్ చెల్లించి రైతులను ప్రోత్సహించడం జరిగిందని తెలిపారు. ఒక సంవత్సరంలో 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, రైతులు పండించిన సన్నరకం వడ్లు బియ్యంగా మారి నిరుపేదల కడుపు నింపుతున్నాయని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు అందిస్తున్నామని, అన్ని రంగాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నామని అన్నారు.18నెలల కాలంలో వ్యవసాయ రంగంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు భీమా, రైతు రుణమాఫీ, పంట కొనుగోలు, సన్నరకం వడ్లకు బోనస్ లలో మొత్తంగా 1 లక్షా 1 వేయి 788 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. దాదాపు 21 వేల కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, పామాయిల్ పంట సాగును ప్రోత్సహించడం జరుగుతుందని, పంట సాగు లో సేంద్రియ వ్యవసాయాన్ని అమలు చేసి ఆరోగ్యకరమైన పంట దిగుబడితో ప్రజల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయంలో వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తూ అవసరమైన పనిముట్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, రైతులు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. వ్యవసాయ శాఖ సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు వేయడం జరుగుతుందని, తద్వారా ఉచిత విద్యుత్ అందడంతో పాటు మహిళలకు అదనపు ఆదాయం అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందని తెలిపారు. వ్యవసాయంపై పూర్తి అవగాహన గల రైతులతో
గ్రామాలలో సభలు నిర్వహించి రైతులకు మెళకువలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, వరితో పాటు లాభదాయకమైన పంటలు సాగు చేయడం, భూ సారానికి అనుగుణంగా సాగు చేయవలసిన పంటలపై అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామ గ్రామాన నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.రాష్ట్రంలో
దాదాపు 60 వేల మంది నిరుద్యోగ యువతకు ఒకే ఏడాదిలో ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. అన్ని రంగాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆర్డీవో వెంకట్ రెడ్డి, తహసిల్దార్ రవీంద్ర , సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.








