ఆదిలాబాద్, మహా
బడీడు పిల్లలు పనిలో కాకుండా పాఠాశాలల్లో ఉండాలనే ఉద్ధేశ్యంతో బాల కార్మికులను గుర్తిస్తున్నామని చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలో వివిధ రెస్టారెంట్లు, పండ్లు, స్క్రాప్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. బాల కార్మికులను గుర్తించి తల్లిదండ్రులతో పాటు వ్యాపారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. గుర్తించిన బడీడు పిల్లలను వారు ఉంటున్న కాలనీల్లోనీ సమీప ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో చేర్పించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు బాలల పరిరక్షణ సమితి కృషి చేస్తుందన్నారు. కలెక్టర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీ చేసి వారిని గుర్తిస్తున్నామని తెలిపారు. పిల్లలు బడిబయట ఉండకుండా వారి భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వ్యాపారులు కూడా చిన్న పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట పరంగా శిక్షార్హులవుతారని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను పాఠశాల్లో చేర్పించి వారికి విద్య బుద్దులు నేర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్సై అనిత, కార్మిక శాఖ జూనియర్ అసిస్టెంట్ సుదీప్ రెడ్డి, అవుట్ రిచ్ వర్కర్ ఆశ్విని, చైల్డ్ లైన్ కేస్ వర్కర్ రామకృష్ణ, సీఆర్పీ భానుప్రకాష్, షూర్ ఎన్టీఓ జిల్లా కోఆర్డినేటర్ కె.వినోద్, కానిస్టేబుల్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.








