Mahaa Daily Exclusive

  పాత అప్పుల గొడవతో ఆటో డ్రైవర్ దారుణ హత్య ముగ్గురు నిందితులు అరెస్ట్ వివరాలు వెల్లడించిన హన్మకొండ ఏసిపి..!

Share

హన్మకొండ మహా;

హనుమకొండ నగరంలో ఆటో డ్రైవర్ హత్య తీవ్ర కలకలం రేపింది.
ఆర్థిక లావాదేవీలు ప్రాణాలు తీశాయి. దశాబ్దకాలంగా కొనసాగుతున్న పాత అప్పుల వివాదం చివరకు హత్యకు దారితీసింది. ఆటోడ్రైవర్‌ను పక్కా ప్రణాళికతో దారుణంగా హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను హనుమకొండ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అరెస్టు చేశారు. మృతుడు, నిందితులలో ఇద్దరు బంధువులే కావడం ఈ కేసులో మరో మలుపు..

ఏసిపి అందించిన వివరాల ప్రకారం…

వడ్డెపల్లి నివాసి, ఆటోడ్రైవర్ అయిన మొహమ్మద్ సాదిక్ హుస్సేన్ (48) తన పెద్దనాన్న కుమారుడు బాదర్ హుస్సేన్ @ బాబుకు 2016లో కుటుంబ అవసరాల నిమిత్తం రూ. 3 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఇందులో కొంత డబ్బు తిరిగి చెల్లించినా, మిగతా మొత్తం విషయంలో తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ అప్పు గురించి బాదర్ కుమారులు, నిందితులు మొహమ్మద్ సోహైల్ హుస్సేన్ @ మోను (23), మొహమ్మద్ బషీర్ హుస్సేన్ సోను (25) లు సాదిక్‌ను తరచుగా బెదిరింపులకు గురిచేశారు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తాం అంటూ పదేపదే హెచ్చరించడం, రాత్రి సమయాల్లో ఫోన్ చేసి దూషించడం, మానసికంగా వేధించడంతో సాదిక్ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు దర్యాప్తులో తేలింది.
ఈ వేధింపులకు ఆగ్రహించిన సోహైల్, బషీర్‌లు.. సాదిక్‌ ను ఎలాగైనా అంతమొందించాలని పక్కా పథకం వేశారు. జూన్ 25, 2025 రాత్రి అందాజ 11:00 గంటల సమయంలో, సోహైల్, బషీర్‌లు సాదిక్ ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. సాదిక్ బయటకు రాగానే, అతన్ని సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి బలవంతంగా లాక్కెళ్లారు. అక్కడ వారికి బంధువు అయిన మొహమ్మద్ అక్రమ్ హుస్సేన్ (40) తోడైయ్యారు. ముగ్గురూ కలిసి సాదిక్‌ను అత్యంత దారుణంగా కొట్టి చంపారు. ప్రత్యేకించి సోహైల్ బలమైన దాడితోనే సాదిక్ మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన తెల్లవారుజామున 01:00 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
హత్యకు గురైన సాదిక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న హనుమకొండ పోలీసులు, తక్షణమే దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. పక్కా ఆధారాలతో మొహమ్మద్ సోహైల్ హుస్సేన్ @ మోను, మొహమ్మద్ బషీర్ హుస్సేన్ @ సోను, మొహమ్మద్ అక్రమ్ హుస్సేన్‌లను అరెస్టు చేసి, వారిపై Cr.No. 374/2025 U/s 103(1) R/w 3(B) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు హనుమకొండ ఏసీపీ పి నరసింహారావు పర్యవేక్షణలో కొనసాగుతోంది.