రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో వార్తలు ప్రచురిస్తున్నారని అక్కసుతోనే బిఆర్ఎస్ శ్రేణులు మహా న్యూస్ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించడాన్ని టీయూడబ్ల్యూజే (ఐజేయు) రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెక్కల శ్రీశైలం, ప్రింట్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు కొనియాల భాస్కర్, కార్యదర్శి దన్నారం రమేష్ లు తీవ్రంగా ఖండించారు. ప్రచురించే వార్త కథనాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రజాస్వామ్యంలో స్పందించి తీరు ఇది కాదని, తమపై వచ్చిన ఆరోపణలను మీడియా ముఖంగా ఖండించడం లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి ఉంటుంది.. కానీ మందబలం, డబ్బు బలం ను పోగేసుకొని ఫోర్త్ ఏస్టేట్ పై దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి మీడియా స్వేచ్ఛను పూర్తిగా భరించి వేశారని, ఇప్పుడు ఉన్న వార్తలను ప్రచురిస్తుంటే గుండాయిజం చేయడమే కాకుండా దాడులు చేయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఎవరైనా సరే మీడియా మీద దాడి చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అని భావిస్తున్నామని తెలిపారు. మహా న్యూస్ పై దాడికి పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకొని భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మరో మారు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.








