ఖమ్మం, మహా.
రాష్ట్రానికి ఆదర్శంగా ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగం అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల పని తీరుపై అధికారులతో సమీక్షించారు.
వ్యవసాయ సాగు, ఎరువులు, విత్తనాల లభ్యత, రైతు భరోసా, రైతు భీమా, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం వంటి పలు అంశాలపై జిల్లా కలెక్టర్ మండలాల వారీగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఆధునిక సాగు పద్ధతులు పాటించడం, పంటల మార్పిడి విధానం అమలు వంటి కార్యక్రమాల్లో మన జిల్లా, రాష్ట్రంలో ఆదర్శవంతంగా తయారు చేయాలని సూచించారు.
ఎరువులు, విత్తనాల లభ్యత పట్ల ఎటువంటి ఫిర్యాదులు రాకుండా మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. విత్తనాల నాణ్యత చాలా కీలకంగా పరిగణించాలని, ఎక్కడ కల్తీ విత్తనాలు విక్రయం జరగకూడదనీ, ఎరువులు, విత్తనాల లభ్యత లేక రైతులు లైన్ లో ఉన్నారు అనే మాట ఖమ్మం జిల్లాలో రావడానికి వీలు లేదని అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులకు తన పరిధిలోని రైతుల గురించి సంపూర్ణ సమాచారం ఉండాలని అన్నారు.
9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసి, వ్యవసాయ రంగ ప్రాధాన్యతను తెలియజేసిందని, ప్రతి మండల వ్యవసాయ అధికారి తన పరిధిలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.
జిల్లాలో ఎరువులు, విత్తనాల స్టాక్ లభ్యత వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ డేట్ కావాలని అన్నారు. మన దేశం ప్రతి సంవత్సరం వేల కోట్ల విలువ చేసే ఆయిల్ పామ్ దిగుబడి చేసుకుంటున్నదని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ పంట ఎక్కువ మొత్తంలో విస్తరించాలని అన్నారు.
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యం చేరుకోవాలని, ప్రతి క్లస్టర్ కు ఒకే రకమైన లక్ష్యాలు కాకుండా స్థానిక పరిస్థితుల కనుగుణంగా ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను నిర్దేశించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి తనకు కేటాయించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలని, రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని అన్నారు. వరి పంట వైపు మాత్రమే రైతు మొగ్గు చూపకుండా లాభసాటి పంటల సాగు జరిగేలా చూడాలని అన్నారు.
ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చిన రైతుల నుండి, రైతు వాటా డీడీలు తీసుకోవాలని, ప్రభుత్వం నుంచి అవసరమైన మంజూరు పత్రాల జారీ వెంటనే జరిగేలా చూడాలని అన్నారు.
ఆధునిక సాంకేతికత ద్వారా వ్యవసాయం సాగు చేయడం వల్ల రైతులకు కలిగే లాభాలను వివరించాలని అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు వారి పరిధిలో ఎరువుల వినియోగం తగ్గించడం, నేచురల్ ఫార్మింగ్ పెంచడం, సాగు దిగుబడి పెంచడం వంటి అంశాలపై దృష్టి సారించి రైతులకు తరచూ అవగాహన కల్పించాలని అన్నారు.
పొలం మధ్యలో ఫిష్ పాండ్ అభివృద్ధి చేయడం వల్ల వచ్చే లాభాల గురించి రైతులకు వివరించాలని అన్నారు. ప్రతి ఇంచ్ భూమి పూర్తి స్థాయిలో వాడుతూ రైతుల ఆదాయం పెంచెందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
నేచురల్ ఫార్మింగ్ జరిగే పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తానని అన్నారు. జిల్లాలో ఇతర రైతులకు కూడా నేచురల్ ఫార్మింగ్ పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. నేచురల్ ఫార్మింగ్ చేసే రైతులతో సాధారణ రైతులకు అవగాహన కల్పన కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, ఇంచార్జ్ జిల్లా ఉద్యానవన అధికారి ముత్యాలు, కూసుమంచి, వైరా, ఖమ్మం అర్బన్, సత్తుపల్లి, మధిర ఏడిఏలు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ అధికారిణి అనిత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








