Mahaa Daily Exclusive

  లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

Share

పెనుబల్లి, మహా.
వన మహోత్సవం క్రింద నిర్దేశిత లక్ష్యాన్ని అధికారులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, వన మహోత్సవ కార్యాచరణ, ఉపాధి హామీ పథకం అమలుపై పెనుబల్లి మండల ఎంపిడివో కార్యాలయంలో అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మానవ మనుగడకు చెట్ల ఆవశ్యకత దృష్ట్యా, వన మహోత్సవం క్రింద మొక్కలు నాటి, వాటి సంరక్షణ చేపట్టాలన్నారు. మొక్కలు నాటుటకు పటిష్ట ప్రణాళిక చేసి, కార్యాచరణ చేయాలన్నారు. ఏ మొక్క, ఏ రోజు, ఎక్కడ నాటుతారు, వాచ్ అండ్ వార్డ్ తదితర విషయాలు స్పష్ట పరచాలన్నారు. నాటిన మొక్కల పరిరక్షణ చేయాలని, వంద రోజులు వాటిని జాగ్రత్తగా కాపాడితే, ఆ తర్వాత అవి మనుగడ పొందుతాయన్నారు.

నర్సరీల్లో ఎన్ని మొక్కలు లభ్యంగా ఉన్నవి, మొక్కలు నాటుటకు ఎన్ని ప్రదేశాలు గుర్తించింది ప్రణాళికలో ఉండాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ కొరకు 8 ఫీట్ల పైబడిన ఎత్తు గల మొక్కలు నాటాలన్నారు. హైవే ఎంత పరిధి ఉన్నది చూసుకొని, రోడ్డుకిరువైపుల కిలోమీటర్ కు 400 చొప్పున మొక్కలు నాటుటకు కార్యాచరణ చేయాలన్నారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత సంబంధిత గ్రామ పంచాయతీకి అప్పగించాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ లో ఏపుగా పెరిగి, మంచి నీడ నిచ్చే వేప, మర్రి, రావి, జువ్వి, నేరేడు లాంటి వాటిని ఎంచుకోవాలన్నారు.

ఉపాధి హామీ క్రింద మండల టార్గెట్ ను కలెక్టర్ సమీక్షించారు. ఎన్ని పని దినాలు, ఏ ఏ పనులు చేపట్టారు, మేజర్ పనులు ఏవి చేపట్టినవి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ లో మెటీరియల్, వేజ్ క్రింద ఎంత మొత్తం ఖర్చయింది అడిగి తెలుసుకున్నారు. రోజువారీ కూలీ రూ. 280 ఇస్తున్నట్లు, దీనిని 300 ఇచ్చే విధంగా పనులు చేపట్టాలన్నారు. ఫిష్ ఫాడర్ పాండ్స్, సిసి రోడ్లు, క్యాటిల్ షెడ్లు ఎక్కువగా చేపట్టాలన్నారు. ఫిష్ ఫాడర్ పాండ్స్ తో ఉపాధితో పాటు, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ అన్నారు.

ఈ సమీక్షలో కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, పెనుబల్లి ఎంపిడివో డి. అన్నపూర్ణ, తహశీల్దార్ నారాయణ మూర్తి, ఏపివో బి. మధుసూదన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.