*ములకలపల్లి, మహా.
గతంలో పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యం అని, అన్ని వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారం ములకలపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి మాదారంలో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ములకలపల్లి లో సీసీ రోడ్లు, జగన్నాధపురం, పాత గంగారంలో బీటీ రోడ్లు, సీతాయి గూడెంలో పంచాయతీ భవనం, కమలాపురం, చాపరాలపల్లి, రామచంద్రాపురం గ్రామాల్లో రూ. 2.80 కోట్లతో నిర్మించిన సీసీ, బీటీ రోడ్లను ప్రారంభించారు. చాపరాలపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.22వేల కోట్లతో రైతు భరోసాను అమలు చేసిందని, రూ. 12వేల కోట్లతో పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తోందని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గతంలో పదేళ్లు ఉన్న బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చేసిందేమీ లేదని.. కుంగిన, కూలిన కాళేశ్వరం, దరిద్రమైన ధరణి మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పాలనను ఓర్వలేక.. తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని, ఈ తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.








