Mahaa Daily Exclusive

  మోదీకి వ్యతిరేకంగా దేశంలో పోరాటం మొదలైంది….

Share

మోదీకి వ్యతిరేకంగా దేశంలో పోరాటం మొదలైంది.
* యువశక్తిని తక్కువ అంచనా వేయొద్దు.
* సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్, మహా.
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పోరాటం ప్రారంభమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం మారుతోందని, ప్రతిపక్షాలు చెప్పే మాటలను కూడా వినే సంస్కృతిని కేంద్ర ప్రభుత్వం అలవర్చుకోవాలని ప్రధానికి హితవు పలికారు. రైతు ఉద్యమం తర్వాత ఇప్పుడు యువత కూడా తమ శక్తిని చాటిందని, ఇటీవల జరిగిన పరిణామాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ప్రజల అభిప్రాయాన్ని స్పష్టం చేశాయని వ్యాఖ్యానించారు.

ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, నిన్న ఢిల్లీలో నరేంద్ర మోదీ, భారత ప్రభుత్వం రాజకీయంగా ఓటమిని చవిచూశాయని అన్నారు. ఇది ప్రధానికి తొలి పరాజయం కాదని, రైతుల ఉద్యమం సమయంలో తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిన సందర్భమే మొదటి ఓటమి అని గుర్తు చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం విమర్శించారు. ఈ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, పేపర్ లీక్‌లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేసినప్పటికీ కేంద్రం స్పందించలేదన్నారు. ఈ అంశాలపై ప్రశ్నించిన ప్రతిపక్షాలను సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో బెదిరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయితే దేశ యువత కేంద్ర ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పిందని, యువశక్తి ఒత్తిడితోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు.

దేశ అభివృద్ధిలో యువత పాత్ర మరింత పెరగాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. యువత లేకుండా “సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్” అనే నినాదం సాకారం కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో యువతకు తగిన ప్రాధాన్యం ఎందుకు కల్పించడం లేదని ప్రధాని మోదీని ప్రశ్నించారు. యువత వీధి పోరాటాలకే పరిమితం కాకుండా చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశం కల్పించాలని, అందుకోసం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే శాసన మండలి, రాజ్యసభ సభ్యత్వానికి కూడా వయోపరిమితిని 25 ఏళ్లుగా నిర్ణయించేలా చట్ట సవరణలు తీసుకురావాలని సూచించారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసిన విషయాన్ని గుర్తు చేసిన సీఎం, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గించారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే అర్హత వయస్సును కూడా తగ్గించాలని అభిప్రాయపడ్డారు.

ఆగస్టులో తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి ఉమ్మడి సమావేశాలను నిర్వహించి ఈ అంశంపై సమగ్ర చర్చ చేపడతామని సీఎం వెల్లడించారు. చట్టసభలకు పోటీ చేసే కనీస వయస్సు తగ్గింపుపై అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, చట్టాల రూపకల్పనలోనూ, పాలనలోనూ వారికి మరింత భాగస్వామ్యం కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.