Mahaa Daily Exclusive

  ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ..!

Share

ఆదిలాబాద్, మహా

ఆశాడ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా ప్రసిద్ధ ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ముఖ్యంగా పట్టణంలోని విఠల రుకుంబాయి ఆలయాలు భక్తులతో కిట కిట లాడాయి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం ఉదయం నుండే భక్తుల సందడి నెలకొంది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉపవాస దీక్షలను పాటించారు. హిందూ పండగలలో వచ్చే తొలి పండగగా భావించి ప్రత్యేక పూజలు జరపడంతో ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. పండగను పురస్కరించుకుని స్థానిక మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండే భక్తుల తాకిడి కనిపించింది. స్వామివారిని ప్రత్యేక హారతులతో కొలిచిన భక్తులు… వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి ఆరాధించారు. అదేవిధంగా స్థానిక రాం నగర్ లో గల శ్రీ విఠల రుక్మాబాయి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వచ్చి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. వేకువజాము నుండే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించగా.. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కమిటి ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. మరోవైపు తొలి ఏకాదశిని పురస్కరించుకుని తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన భక్తులు కుచులాపూర్ లోని విఠలేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. స్థానిక రామ మందిరం నుండి ప్రారంభమైన పాదయాత్రలో భజన, సంకీర్తన లు చేస్తూ ముందుకు సాగారు. పదహారు కిలోమీటర్లు పాదయాత్ర జరగనుండగా… ఇందులో ఆలయ అర్చకులు విశాల్ శర్మ, కప్పర్ల గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాజేశ్వర్, పడాల శేఖర్ లతో పాటు మహిళ భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు విశాల్ శర్మ ఏకాదశి విశిష్టత ను తెలియజేసారు. లోక కళ్యాణం కాంక్షిస్తూ పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు.