రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
రంగారెడ్డి జిల్లా పచ్చబడితే తెలంగాణ మొత్తం పచ్చబడుతుందని, 40 ఏళ్ల వరకు డోకా లేని, లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ పంటను రైతులు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సోమవారం చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని పెద్దవీడు గ్రామంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ డా.పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ళ శాసన సభ్యులు కాలే యాదయ్యలతో కలిసి ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… జిల్లాలోని రైతులు ఎవరూ భూములు అమ్ముకోవద్దని, పంటలు వేసుకోవాలని, తద్వారా వర్షాలు సమృద్ధిగా కురవడంతోపాటు సంతృప్తినిస్తుందని రైతులకు మంత్రి వివరించారు. ఇప్పటి వరకు 3 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగవుతోందని, ఈ సంవత్సరం మరో మూడు వేల ఎకరాలు పెరగాలని ఆయన అన్నారు. కంపెనీ వారే మీ తోటలోకి వచ్చి పంటను సేకరిస్తారని, ధర, రవాణా వంటి ఇబ్బందులు కూడా ఉండవని, కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలలోకి డబ్బును జమ చేస్తారని మంత్రి తెలిపారు. మనకు వంద లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ అవసరమని, ప్రస్తుతం మనం 3 లక్షలు పండిస్తున్నామని, దీంతో ఇతర దేశాల నుంచి లక్షన్నర కోట్లు పెట్టి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటసాగుకు వీలు ఉందని, కనీసం 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో పంట వేసినా, దేశానికి మన రాష్ట్రం ఆయిల్ పామ్ సరఫరా చేయవచ్చన్నారు. రానున్న రెండు, మూడేళ్లలో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో పది ఫ్యాక్టరీలను నిర్మించనున్నామని, ఇందుకోసం పూర్తి అనుమతులు పొందడం జరిగిందని, వచ్చే నెలలో సిద్ధిపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ డా.పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా రైతులు ఆయిల్ పామ్ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారని, ఇప్పటికే 4 వేల ఎకరాల్లో పంటను సాగుచేస్తున్నారని అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ ఏకకాలంలో అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని, జిల్లాలో 2 లక్షల 83 వేల మంది రైతులకు 323 కోట్ల 50 లక్షలు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. అదే విధంగా రుణమాఫీ కింద ప్రతి రైతుకు రెండు లక్షల చొప్పున మాఫీ చేస్తూ జిల్లాలో 1 లక్షా 4వేల మంది రైతులకు రూ.747 కోట్ల 41 లక్షలు రుణ మాఫీ చేశామన్నారు. సర్దార్ నగర్ మార్కెట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను మంజూరు చేసిందని మహేందర్రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమల డైరెక్టర్ యస్మిన్ బాషా, జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి సురేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.








