Mahaa Daily Exclusive

  విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాపాడాలి పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి చేవెళ్లలో ధర్నా నిర్వహించిన విద్యార్థి సంఘాలు..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎర్రవల్లి శ్రీనివాస్, బేగరి అరుణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న రూ.8700 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేసి రహదారి దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరేండ్లుగా పెండింగ్ స్కాలర్షిప్ లను, ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఉజ్వల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందన్నారు. విద్యార్థుల బకాయిలు విడుదల చేయకపోవడంతో ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్స్ ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధులపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థుల క్లాసులు నష్టపోతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా విద్యా వ్యవస్థ పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆచరణలో మాత్రం శూన్యమన్నారు. నేటికి విద్యారంగానికి మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు చూస్తే విద్యా వ్యవస్థ పట్ల చిత్త శుద్ధి అర్థం అవుతుందన్నారు. మాటలే తప్ప చేతల్లో చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ ఉపాధ్యక్షులు ఎండి. సమీర్, యశ్వంత్, ఎస్ఎఫ్ఐ డివిజన్ సహాయ కార్యదర్శి, చరణ్ గౌడ్, మాల చందు, బేగరి తేజ, ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు చిరంజీవి, ప్రశాంత్, ఆకాష్, సోఫియాన్, మోసిన్, అజర్, వంశీ, సాయి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest