హన్మకొండ మహా;
హనుమకొండ జిల్లాలోని పలివేల్పుల రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాల వరంగల్ వెస్ట్ ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ లోని తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. ఐదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థినులతో మాట్లాడారు. వెల్ నెస్ సెంటర్ తో పాటు కిచెన్, డైనింగ్ హాలును కూడా పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిలువ చేసిన బియ్యం, కూరగాయలు, ఇతర వంట సామాగ్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. వంట చేస్తున్న కార్మికుల తోనూ కలెక్టర్ మాట్లాడారు. టాయిలెట్స్ బ్లాక్ తో పాటు పాఠశాల పరిశుభ్రతను పరిశీలించారు. ప్రొవిజన్స్ ఎక్కడి నుంచి వస్తాయని, ఎలా ఇండెంట్ నమోదు చేస్తారని కలెక్టర్ ఆరా తీశారు. కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించి విద్యార్థినులకు ఏ విధంగా ఉపయోగపడుతుందని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో ఏర్పాటుచేసిన ఫోన్ సౌకర్యాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఐదో తరగతిలో చేరిన విద్యార్థినుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హాస్టల్ లోని సౌకర్యాలు, సదుపాయాలను గురించి ప్రిన్సిపల్ సుభాషిణి జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.








