Mahaa Daily Exclusive

  యువత కోసం ‘కాక్రోచ్ క్లబ్’….

Share

యువత కోసం ‘కాక్రోచ్ క్లబ్’.
* సీజేపీ సరికొత్త ప్రయోగం!
* రాజకీయ చర్చలు.. పుస్తక పఠనం.. సినిమాలు.. వినోదం.. ఒకే వేదికపై అవకాశం.
* గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌ ఆలోచనలపై మేధోమథనం.
* పోటీ పరీక్షలకు స్టడీ సెంటర్‌
పుణెలో తొలి సమావేశం.

న్యూఢిల్లీ, మహా:
యువతను రాజకీయ, సామాజిక చర్చల్లో భాగస్వాములను చేయడంతోపాటు వారిలో స్వతంత్ర ఆలోచనా ధోరణిని పెంపొందించే లక్ష్యంతో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘కాక్రోచ్‌ క్లబ్‌’ పేరుతో యువత కోసం ప్రత్యేక భౌతిక వేదికను ప్రారంభించింది. కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా పుస్తక పఠనం, అధ్యయనం, ఉపన్యాసాలు, వాదోపవాదాలు, సినిమాల ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలకు కూడా ఇందులో ప్రాధాన్యం కల్పించనుంది. దేశ భవిష్యత్తుపై యువత తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి, భిన్నమైన ఆలోచనలను తెలుసుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకోవచ్చని పార్టీ సహ కన్వీనర్‌, ప్రధాన ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ వెల్లడించారు.

మహనీయుల ఆలోచనలపై చర్చలు.

మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వంటి ప్రముఖ నాయకుల ఆలోచనలు, సిద్ధాంతాలను నేటి తరానికి పరిచయం చేయడం ఈ క్లబ్‌ కార్యక్రమాల్లో ముఖ్యమైన అంశంగా ఉండనుంది. వారి భావజాలం, దేశ నిర్మాణంలో వారు పోషించిన పాత్ర, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలు వంటి అంశాలపై ఉపన్యాసాలు, చర్చలు నిర్వహించనున్నారు. ఒకే అభిప్రాయాన్ని అందరిపై రుద్దడం కాకుండా, వివిధ దృక్కోణాలను పరిచయం చేస్తూ యువత స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తామని సౌరవ్‌ దాస్‌ తెలిపారు.

పుణెలో తొలి సమావేశం.. ఉచిత ప్రవేశం.

మహారాష్ట్రలోని పుణెలో నవంబర్‌ 21న ‘లెగసీ ఆఫ్‌ బాపు’ (బాపు వారసత్వం) థీమ్‌తో కాక్రోచ్‌ క్లబ్‌ తొలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సౌరవ్‌ దాస్‌తోపాటు పార్టీ సహ కన్వీనర్‌ అశుతోష్‌ రాంకా, పలువురు కమెడియన్లు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దిప్కే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. సంప్రదాయ నిరసన ప్రదర్శనలకు భిన్నంగా వ్యంగ్యం, వినోదం, బహిరంగ సంభాషణల ద్వారా గాంధీజీ ఆలోచనలను నేటి జెన్-జీ యువతకు చేరువ చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితంగా కల్పించినప్పటికీ, ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, అధికారిక పాస్‌ను తప్పనిసరి చేశారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ను విడుదల చేయనున్నట్లు అశుతోష్‌ రాంకా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

చదువుతోపాటు వినోదానికీ పెద్దపీట.

ప్రస్తుత యువత అభిరుచులను దృష్టిలో ఉంచుకుని క్లబ్‌ కార్యకలాపాలను రూపొందించినట్లు సౌరవ్‌ దాస్‌ వివరించారు. విద్యార్థులు ఒకచోట చేరి ప్రశాంతంగా చదువుకోవడానికి, పుస్తకాలు పరిశీలించడానికి, పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి అవసరమైన వాతావరణాన్ని ఈ క్లబ్‌లలో కల్పించనున్నారు. మరోవైపు సినిమా ప్రదర్శనలు, ప్రత్యక్ష కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాండప్‌ కామెడీ వంటి వినోద కార్యక్రమాలనూ నిర్వహించనున్నారు. ఆలోచనలకు పదును పెట్టే మేధోమథన చర్చలతోపాటు స్నేహితులతో కలిసి నవ్వుతూ, సరదాగా గడిపేందుకు ఇది చక్కని వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

నిరసనల నుంచి ప్రజా భాగస్వామ్యం వైపు.

నిరుద్యోగ యువతపై గతంలో వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా వ్యంగ్య రాజకీయ వేదికగా అభిజీత్‌ దిప్కే ప్రారంభించిన కాక్రోచ్‌ జనతా పార్టీ, అనతికాలంలోనే విద్యార్థుల సమస్యలు, పరీక్షల నిర్వహణలో అక్రమాలు, నిరుద్యోగంపై పోరాటాలతో దేశవ్యాప్తంగా యువత దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు కాక్రోచ్‌ క్లబ్‌ ద్వారా యువతతో నిరంతర సంబంధాలు ఏర్పరచుకోవడం, వారి సమస్యలను తెలుసుకోవడం, చర్చల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించడం వంటి కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. పుణెలో ప్రారంభమైన ఈ వేదికను త్వరలోనే దేశంలోని ఇతర ప్రధాన నగరాలకూ విస్తరించాలనే ప్రణాళిక ఉన్నట్లు పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.