నా మాట విని బంగారం కొనుగోళ్లు తగ్గించారు.
* ప్రజల డబ్బు ఆదా అయింది!
* శాస్త్రి పిలుపును పాటించినట్లే నా విజ్ఞప్తికీ స్పందించారు.
* మే 10న సికింద్రాబాద్ నుంచే తొలి పిలుపు ఇచ్చానని గుర్తుచేసిన ప్రధాని నరేంద్ర మోదీ.
* డిగ్రీలతో పాటు నైపుణ్యం ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు అని యువతకు దిశానిర్దేశం.
లక్నో,మహా.
అనవసరంగా బంగారం కొనుగోళ్లు చేయకుండా ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని తాను చేసిన విజ్ఞప్తికి దేశ ప్రజలు ఎంతో సానుకూలంగా స్పందించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు తన పిలుపును పాటించడం వల్లే పసిడి ధరలు దిగివచ్చాయని, తద్వారా కొనుగోళ్లు వాయిదా వేసుకున్న కుటుంబాలకు ఎంతో డబ్బు ఆదా అయిందని పలువురు తనకు చెబుతున్నారని పేర్కొన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గోమతీనగర్ ఇందిరాగాంధీ ప్రతిష్ఠాన్‌లో నిర్వహించిన ఐదో జాతీయ నైపుణ్య స్నాతకోత్సవం (కౌశల్ దీక్షాంత్ సమారోహ్)లో పాల్గొన్న ప్రధాని ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శాస్త్రి స్ఫూర్తిని గుర్తుచేసుకున్న మోదీ.
1965లో దేశం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొన్న సమయంలో అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ప్రజలకు ఒకపూట భోజనం మానేయాలని పిలుపునిచ్చారని మోదీ గుర్తుచేశారు. ఆనాడు దేశ ప్రజలు ఆ విజ్ఞప్తిని శిరసావహించి దేశానికి అండగా నిలిచారని చెప్పారు. నేటికీ భారతీయుల్లో అదే దేశభక్తి, త్యాగనిరతి, జాతీయ బాధ్యతాభావం సజీవంగా ఉన్నాయని ప్రశంసించారు. నాలాంటి ఒక సామాన్య వ్యక్తి బంగారం తక్కువగా కొనాలని కోరితే దేశ ప్రజలు స్పందించి కొనుగోళ్లు తగ్గించారని, ఇప్పుడు చాలామంది తనను కలిసి ‘మోదీజీ, మీరు చెప్పిన మాట విన్నాం.. మా డబ్బు ఆదా అయింది’ అని చెబుతున్నారని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ వేదిక నుంచే తొలి విజ్ఞప్తి.
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఏర్పడటంతో ఈ ఏడాది మే 10న తెలంగాణలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ తొలిసారిగా ఈ పిలుపునిచ్చారు. ఏడాది పాటు అత్యవసరం కాని బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని, విదేశీ పర్యటనలను తగ్గించాలని అప్పట్లో కోరారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం, ప్రజా రవాణాను ఉపయోగించడం, వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియో సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. భారత్ తన బంగారం అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటున్న నేపథ్యంలో, పసిడి కొనుగోళ్ల నియంత్రణ విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి దోహదపడుతుందని అప్పట్లో వివరించారు.
అంతర్జాతీయ అంశాల ప్రభావమూ ఉంది.
ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో దేశీయంగా బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. అయితే ఈ తగ్గుదలకు ప్రజలు కొనుగోళ్లు తగ్గించడం ఒక్కటే కారణం కాదని ప్రపంచ స్వర్ణ మండలి (వరల్డ్ గోల్డ్ కౌన్సిల్) నవంబర్ 17న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అమెరికా డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడిదారులు బంగారాన్ని విక్రయించడం వంటి పరిణామాలు ధరలపై ప్రభావం చూపాయని వివరించింది. మరోవైపు పండుగల సమయంలో భారత్‌లో ఆభరణాలు, నాణేలు, కడ్డీల కొనుగోళ్లు పెరిగినట్లు ఆ నివేదిక వెల్లడించింది. అక్టోబర్‌లో దేశీయ బంగారం ధరలు 1.8 శాతం తగ్గగా, నవంబర్ 12 నాటికి అంతర్జాతీయంగా ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి.
నైపుణ్యానికే భవిష్యత్తులో పెద్దపీట.
కౌశల్ దీక్షాంత్ సమారోహ్‌లో యువత భవిష్యత్తు, నైపుణ్య విద్య ప్రాధాన్యంపై కూడా ప్రధాని దిశానిర్దేశం చేశారు. కేవలం డిగ్రీలు, సర్టిఫికెట్లు ఉంటే సరిపోదని, వృత్తిపరమైన నైపుణ్యాలు కలిగిన వారికే భవిష్యత్తులో ఉద్యోగ మార్కెట్లో అధిక అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. చేతివృత్తులు, సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి విద్యలో శిక్షణ పొందిన యువతకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐ), జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలు, శిక్షకుల శిక్షణ సంస్థలకు చెందిన 52 మంది జాతీయస్థాయి ప్రతిభావంతులను ప్రధాని సత్కరించారు.







