Mahaa Daily Exclusive

  గంగానదిపై 9.76 కి.మీ. భారీ వంతెన ప్రారంభం….

Share

గంగానదిపై 9.76 కి.మీ. భారీ వంతెన ప్రారంభం.
• రూ.4,280 కోట్లతో నితీష్ సేతు నిర్మాణం.
• పాట్నా నుంచి వైశాలికి కొత్త అనుసంధానం

పాట్నా, మహా:

బీహార్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. గంగానదిపై నిర్మించిన భారీ నితీష్ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పాట్నాలోని కచ్చి దర్గా నుంచి వైశాలి జిల్లాలోని బిదుపూర్ వరకు నిర్మించిన ఈ వంతెనతో ఉత్తర, దక్షిణ బీహార్ ప్రాంతాల మధ్య రవాణా అనుసంధానం మెరుగుపడనుంది. రూ.4,280 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ప్రధాన వంతెన పొడవు 9.76 కిలోమీటర్లు కాగా, అనుసంధాన రహదారులతో కలిపి మొత్తం కనెక్టివిటీ 19.7 కిలోమీటర్లుగా ఉంది.

వంతెన ఆరు వరుసలతో కూడిన ఎక్స్‌ట్రాడోస్డ్ కేబుల్‌ స్టేడ్‌ నిర్మాణం. ఈ వంతెనకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పేరు మీద ‘నితీష్ సేతు’గా నామకరణం చేశారు. ప్రధానమంత్రి మోదీతో పాటు బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని కొద్దిసేపు వంతెనపై నడిచి పరిశీలించారు.

ఈ వంతెన అందుబాటులోకి రావడంతో ఇప్పటికే గంగానదిపై ఉన్న మహాత్మాగాంధీ సేతు, జేపీ సేతులపై వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ బీహార్ మధ్య ప్రయాణ సమయం తగ్గడంతోపాటు రఘోపూర్ దియారా ప్రాంత ప్రజలకు పాట్నాకు చేరుకోవడం సులభం కానుంది. ముఖ్యంగా వైద్యం, విద్య వంటి అత్యవసర సేవలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.

వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక సరుకుల రవాణాకు కూడా ఈ మార్గం ఉపయోగపడనుంది. మార్కెట్లకు వేగంగా చేరుకునే అవకాశం కలగడంతో ప్రాంతీయ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభించనుంది.

ఇదే పర్యటనలో భాగంగా వైశాలిలో సుమారు రూ.34,470 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించడంతోపాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. రహదారులు, విద్యుత్, పట్టణాభివృద్ధి, సాగునీరు, విద్య, వైద్య, రవాణా రంగాలకు సంబంధించిన పనులు ఇందులో ఉన్నాయి.

* ప్రధాన వంతెన: 9.76 కిలోమీటర్లు

* మొత్తం ప్రాజెక్టు: 19.7 కిలోమీటర్లు

* అప్రోచ్ రోడ్లు: 10 కిలోమీటర్లు

* వంతెన: ఆరు వరుసలు

* నిర్మాణ వ్యయం: రూ.4,280 కోట్లు