ఇల్లందు, మహా.
ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి బానోతు హరిప్రియహరిసింగ్ నాయక్ వర్షాకాలం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. గత ఐదు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.
తడిచిన చేతులతో ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, కరెంట్ స్తంభాలను తాకవద్దని హెచ్చరించారు. వర్ష ప్రభావం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. చిన్న పిల్లలు చెరువులు, వాగులు, కుంటలు, కాలువల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వర్షపు నీరు పోటెత్తే వాగులు చూడటానికి బయటకు వెళ్లడం, సెల్ఫీలు తీసుకోవడం వలన ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాణాలకు ముప్పు తలెత్తకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హరిప్రియ నాయక్ తెలిపారు.







