బోనకల్, మహా.
బలహీన వర్గాలపై జరుగుతున్న అణచివేత చర్యలను ముదిరాజ్ సంఘం తీవ్రంగా ఖండించింది. బోనకల్ మండలం రావినూతల గ్రామంలో ముదిరాజ్ సంఘం సమావేశంలో, మత్స్యకార సంఘం నేత బొమ్మకంటి సైదులు పై జరిగిన భౌతిక దాడి తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
ఈ ఘటనలో బిఆర్ఎస్‌కు చెందిన కొమ్మినేని ఉపేంద్ర, చేబ్రోలు మల్లికార్జునరావులు ప్రత్యక్షంగా దాడికి పాల్పడినట్లు సంఘ సభ్యులు ఆరోపించారు. అగ్రకుల అహంకారంతో ఈ దాడులు జరిగాయని, ప్రజలకు సేవ చేస్తూ తమ వృత్తినే జీవనోపాధిగా మార్చుకున్న మత్స్యకారులను చులకనగా చూడటమే కాకుండా, భౌతికంగా దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.
కులవృత్తులపై అసహిష్ణుతకు ముదిరాజ్ సంఘం గళమెత్తింది
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గణపారపు వెంకటేశ్వర్లు, కార్యదర్శి రెడ్డిబోయిన ఉద్దండు మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడుతూ, తమ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులను అగౌరవపరిచే ప్రయత్నాలు అమానుషం. ఇలాంటి దాడులకు పాల్పడేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే, ముదిరాజ్ సంఘం ఆందోళనను తీవ్రతరం చేస్తుంది,” అని హెచ్చరించారు.
ఈ సమావేశంలో రావినూతల మత్స్యసంఘం అధ్యక్షుడు బొమ్మకంటి సైదులు, రెడ్డిబోయిన వీరబాబు (చిన్న బీరవల్లి అధ్యక్షుడు), మంచి బోయిన సైదులు (రావినూతల మత్స్యశాఖ కార్యదర్శి), గణపారపు నాగేశ్వరరావు, సోమనబోయిన రాంబాబు, కోలా శ్రీకాంత్, పెద్ద బీరవల్లి మత్స్యసంఘం అధ్యక్షుడు ఆకం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.







