భూపాలపల్లి మహా :
జిల్లాలోని అన్ని వసతి గృహాలల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
అన్నారు. మంగళవారం ఐడిఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ నుండి వసతి గృహాల జిల్లా అధికారులు, వసతి గృహాల పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడిఓ లు, వార్డెన్స్ తో
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్దేశిత మెనూ పాటించాలని తెలిపారు. వంట గదులు, సామాన్లు భద్ర పరచు గదులు, పారిశుధ్యం నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, ఆర్.ఓ ప్లాంట్లు పనితీరు, కూరగాయలు, మాంసం, పప్పుల సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి మూడు రోజులకు ఒక్కసారి ప్రత్యేక అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని అన్నారు. బయటి నుండి వచ్చే భోజనం ఇతర పదార్థాలు వసతి గృహాలల్లోకి అనుమతించకూడదని, బయటి తిను పదార్థాల వల్ల పుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులతో కలిపి ఫుడ్ కమిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థులకు భోజనం అందించే ముందు ఫుడ్ కమిటీ సభ్యులు భోజనం చేసి భోజనం నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు.
పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి 10 రోజులకు ఒక్కసారి గ్రామాల లోని, వసతి గృహాలలోని మంచి నీటి ట్యాంకులను పరిశుభ్రం చేపించాలని స్పష్టం చేశారు. వసతి గృహాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పరిసరాల్లో పిచ్చి మొక్కలు, వ్యర్థాలు తొలగించి పరిశుభ్రం చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని ఏదేని సంఘటన జరిగితే జిల్లాకు చెడు పేరు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
ప్రత్యేక అధికారులు వసతి గృహాలను దత్తతు తీసుకున్నట్లు ప్రతి విషయాన్ని నిశితంగా గమనించాలని, వాళ్ళు మన పిల్లలు అనుకుని సౌకర్యాలు.పర్యవేక్షణ చేయాలన్నారు. సమస్యలు ఉంటే తక్షణమే పై అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
గూగుల్ ఫామ్ లో గుర్తించిన సమస్యలపై నమోదు చేయాలని అన్నారు. రాత్రి వేళల్లో సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని,
విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని,
వైద్యులు ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఆర్ ఓ వాటర్ ప్లాంట్లను తనికి చేయాలని సూచించారు. ప్రత్యేక అధికారుల పరిశీలనను జిల్లా కేంద్రం నుండి మానిటరింగ్ చేయడం జరుగుతుందని,నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి శుక్రవారం ఫుడ్ విత్ చిల్డ్రన్ కార్యక్రమం చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ప్రత్యేక అధికారులు, సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.







