Mahaa Daily Exclusive

  ఫుడ్ పాయిజన్ ఘటన పునరావృతం కాకుండా చర్యలు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..!

Share

భూపాలపల్లి,మహా :

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని కొరికించాల కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ ఘటన జిల్లాలో ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. విద్యార్థుల సంక్షేమంలో అలసత్వాన్ని సహించబోమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు.
మంగళవారం మొగుళ్లపల్లి మండలం కోర్కెశాలలోని కెజిబివి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.సోమవారం పురుగుపడిన అల్పాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై కలెక్టర్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వంటవాళ్లను సస్పెండ్ చేశారు. కొత్తగా నియమితులైన వంటవాళ్లతో ముఖాముఖి మాట్లాడి మంచిగా వంట చేయాలని, ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని
నాణ్యతకు కట్టుబడాలని, పాడైన బియ్యం, సరుకులు వినియోగించొద్దని స్పష్టం చేశారు. జిల్లాలోని 62 సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు వారి సమస్యలను తెలియచేయడానికి వీలుగా ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదుల బాక్స్ కు తాళం వేయాలని
విద్యార్థులు తమ సమస్యలను ఆ పెట్టెల్లో స్వేచ్ఛగా వ్రాసి వేయాలని, ప్రతి వారం వాటిని తెరచి సమస్యలు గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే విద్యా శాఖ కార్యాలయంలో 9949194492, 9000996933, 9441924901 కంట్రోల్ రూము నంబర్లు ఏర్పాటు చేయాలని ఈ నంబర్లకు నేరుగా కాల్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు. అందిన సమాచారం గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
అల్పాహారంలో పురుగుపడిన ఘటనపై ఎస్ ఓ కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఈఓకు సూచించారు. 8, 9, 10వ తరగతులను పరిశీలించి విద్యార్థులతో ఆహార నాణ్యత అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో పాఠాలు చదివించి వారి ప్రతిభను అభినందించారు. ఇంకా మెరుగయ్యేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థిని పూజశ్రీ భవిష్యత్తులో తాను ఐపీఎస్ అధికారిని కావాలన్న ఆకాంక్షను వెల్లడించగా, కలెక్టర్ అభినందిస్తూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని బాగా చదవాలని, అపుడే అనుకున్న లక్ష్యాన్ని సాదించగలమని ప్రోత్సహించారు.
అంతకు ముందు విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విడివిడిగా సమావేశం నిర్వహించి మీ పిల్లలు బాగా చదుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక అధికారులు ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. ప్రతి హాస్టల్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఫుడ్ కమిటీ ఏర్పాటు చేశామని, ఆహార నాణ్యతను పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యే వరకు ఆరోగ్య శిబిరం కొనసాగాలని అన్నారు. ఆరోగ్య శిబిరం లో అత్యవసర మందులు పరిశీలించారు. ఇంటికి వెళ్లిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ని వాకబు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఇంఛార్జి వైద్యాధికారి డా శ్రీదేవి, తహసీల్దార్ సునీతా, ఎంపిడిఓ సురేందర్ తదితరులు. పాల్గొన్నారు.