మంచిర్యాల, మహా : ఓ తల్లి వివాహేతర సంబంధం తన కన్న కొడుకు ప్రాణం తీసిన ఘటన గురువారం నెన్నెల మండలం, గంగారం గ్రామంలో కలకలం రేపింది. గ్రామస్తుల కథనం ప్రకారం గంగారం గ్రామానికి చెందిన మృతుడి తల్లి రాజేశ్వరికి,
ఆవడం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తిరుపతికి గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుందని తెలిపారు. బుధవారం ఏదో పనిపై బయటికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన మృతుడు అనిల్ (20) కు తల్లి తిరుపతిలు కంటపడినట్లు చెప్పారు. ఇదేంటిదని తల్లిని ప్రశ్నిస్తే ఆమె దురుసుగా బదిలించినట్లు తెలుస్తోంది. ఈ అవమానాన్ని తట్టుకోలేక అనిల్ తన మొబైల్ ఫోన్ లో తన తల్లి వివాహేతర సంబంధం వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి సంహారక మందు సేవించినట్లు సమాచారం. దీనిని గ్రహించిన కుటుంబ సభ్యులు అనిల్ ను హుటాహుటిన మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. కాగా అనిల్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు సమాచారం. మరణ వార్తతో కోపోద్రిక్తులైన మృతుని తండ్రి బాపు, అతని కుటుంబ సభ్యులు అనిల్ మృతదేహాన్ని ఆటో డ్రైవర్ ఇంటి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మృతుని బంధువులు ఆగ్రహంతో తిరుపతి ఇంట్లోకి వెళ్లి ఇంటికి నిప్పు పెట్టారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో బెల్లంపల్లి ఎసిపి రవికుమార్ హుటాహుటిన పోలీసు బలగాలతో ఆవుడం గ్రామానికి చేరుకుని మృతుడి బంధువులను శాంతింపజేశారు.
గ్రామంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. ఇది ఇలా ఉండగా తన చావుకు తల్లి కారణమని మృతుడు అనిల్ మరణ వాంగ్మూలం ఇచ్చినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. పూర్తి సమాచారం తెలియవలసి ఉంది. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







