ఆదిలాబాద్ మహా: జిల్లాలో మహిళల అక్షరాస్యతాశాతాన్నిగణనీయంగా పెంచాల్సిన అవసరముందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం డీఆర్డీఓ, విద్యాశాఖ ఇతర అధికారులతో కలిసి ఉల్లాస్ నవభారత్ సాక్షరతా జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణా మాన్యువల్, అక్షర వికాసం, మార్గదర్శి కరదీపిక బుక్స్ ను ఆయన ఆవిష్కరించారు. డీఆర్ డీవో, మెప్మ తో పాటు పలు శాఖల జిల్లా రిసోర్స్ పర్సన్ల కు ఆయన పలు సూచనలు చేసారు. మహిళల అక్షరాస్యత పై ఎక్కువగా దృష్టి సారించాల్సిఉందన్నారు. జిల్లాలో పురుషుల అక్షరాస్యతా 70 నుండి 75 శాతం ఉంటే మహిళలు 50 నుండి 55 శాతం మాత్రమే ఉన్నారన్నారు. జిల్లాలో చేస్తున్న ఎన్ రోల్ మెంట్ లో మహిళలు ఎక్కువగా ఉండేలా చూడాలన్నారు. జిల్లా రిసోర్స్ పర్సన్లు ఎమ్మార్పీలకు ఈ విషయాలపై శ్రద్ధ వహించేలా తగు సూచనలు ఇవ్వాలన్నారు. ఎన్రోల్ మెంట్ మాత్రమే కాకుండా డైలీ హాజరయ్యే విధంగా చూసి హాజరు శాతాన్ని కూడా నమోదు చేయాలన్నారు. జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమం ద్వారా 32821 మంది చదువురాని , వయోజన విద్యకు అర్హులైన వారిని గుర్తించామన్నారు.25,996 మందిని ఉల్లాస్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలిపారు.అలాగే వయోజన విద్య ద్వారా చదువు నేర్పించేందుకు 1192 మంది వాలంటీరు ఉల్లాస్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం 26, 312 కు చేరువలో ఉన్నామని త్వరితగతిన పూర్తి చేయాలని ఆన్నారు.ఓపెన్ స్కూల్ లో 1698 మంది టార్గెట్ కాగా లక్ష్యాలను అధిగమించి 2753 గుర్తించామన్నారు. 625 మంది వెబ్సైట్ లో రిజిస్టర్డ్ చేసుకున్నారని, అడ్మిషన్లు చివరి తేది ఈ నెల 18 వరకు ఉందని పేర్కొన్నారు.జిల్లాలో అక్షరాస్యత శాతం 66 ఉందని వంద శాతం పూర్తి చేయుటకు కృషి చేయాలనీ, మహిళల్లో అక్షరాస్యత పెంచుటకు అవగాహన కల్పించాలని ఆన్నారు.ఈ శిక్షణా కార్యక్రమం అనంతరం తమ ప్రాంతాల్లో ఉల్లాస్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్ డీవో రవిందర్, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీవీయన్ రాజు, ఒపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు







