కొత్తగూడెం, మహా.
కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని భూసరాయి గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో గ్రామస్థులు ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. మాదకం బీడ అలియాస్ రాజు (35) అనే వ్యక్తిని కొందరు స్థానికులు గురువారం కొట్టి చంపారు. రాజు గుత్తికోయ తెగకు చెందినవాడిగా గుర్తించారు.
స్థానిక సమాచారం ప్రకారం, ఒక మహిళ ఆకస్మికంగా మరణించిన నేపథ్యంలో, ఆమె మరణానికి రాజు చేసిన మంత్రాలే కారణమని గ్రామస్తులు భావించారు. దీనిపై ఆగ్రహించిన కొందరు గ్రామస్థులు రాజుపై దాడి చేసి అతడిని అక్కడికక్కడే హతమార్చారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ హత్యలో పాల్గొన్న వారిని గుర్తించి, అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘటన సామాజిక మూఢనమ్మకాల ప్రభావాన్ని తేటతెల్లం చేస్తోంది. ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కేసులో పూర్తి న్యాయం జరగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.








