జూలూరుపాడు, ఆగస్టు 11, (మహా): లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎంపీల అక్రమ అరెస్ట్ లను నిరసిస్తూ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం సాయంత్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. అక్రమ అరెస్టులకు భయపడే వ్యక్తి రాహుల్ గాంధీ కాదని, వారిది దేశం కోసం త్యాగాలు చేసే కుటుంబమని గుర్తు చేశారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పై గెలిసి చూపించాలని బిజెపి ప్రభుత్వానికి సవాలు విసిరారు. వెంటనే అరెస్ట్ చేసిన ఇండియా కూటమి లోక్ సభ సభ్యులందరినీ విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వం పై నిరసన జ్వాలలు రగులుతాయని హెచ్చరించారు. విషయం తెలిసిన స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పార్టీ నాయకులతో మాట్లాడి ధర్నాను విరమింప చేశారు. కార్యక్రమంలో లేళ్ళ వెంకటరెడ్డి, దుద్దుకూరి మధుసూదనరావు, రామిశెట్టి రాంబాబు, లచ్చు నాయక్, చౌడం నరసింహారావు, ధారావత్ రాంబాబు, కొల్లిపాక వెంకటేశ్వర్లు, రామకృష్ణ తోపాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.







