మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం ఎస్.బి.ఐ. బ్రాంచి- 2 బ్యాంకులో బంగారం, డిపాజిట్లు కలిసి దాదాపు 4 కోట్ల రూపాయలు మాయం..!? అయినట్లు బ్యాంకు ఆడిట్ అధికారులు గురువారం గుర్తించిన వైనం జిల్లాలో కలకలం రేపింది. బ్యాంకులలో ప్రజల సొమ్ములకు భద్రత ఉంటుందని భావించి ప్రజలు నగదు, బంగారంలను వివిధ బ్యాంకులలో దాచుకోవడం షరా మామూలే. అయితే ఈ బ్యాంకులలో కూడా నగదు, బంగారం, డిపాజిట్లు మాయం కావడంపై ప్రజలు కలవర పడుతున్నారు. చెన్నూరు ఎస్బిఐ – 2 బ్యాంకులో ఆ శాఖ ఆడిట్ అధికారులు గురువారం బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఉదయం నుండి కార్యాలయంలో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలలో 2 కిలోల 500 గ్రాముల బంగారం, 80 లక్షల రూపాయల డిపాజిట్లలో అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. దాదాపు 4 కోట్ల రూపాయల వరకు తేడా రావడంతో బ్యాంకు మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. దీనితో బ్యాంకు లోపల గడియ పెట్టి పోలీసులు, బ్యాంక్ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. బ్యాంకు క్యాషియర్ రవీందర్ విధులకు రాకపోవడంతో అతనిపై బ్యాంకు సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..? బంగారం, డిపాజిట్లు మాయమైనట్లు తెలుసుకున్న రామగుండం సిపి అంబార్ కిషోర్ ఝు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బ్యాంకు మేనేజర్ మనోహర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని సిపి వెల్లడించారు. అన్ని కోణాలలో విచారణ చేపట్టి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు. బ్యాంకులో ఎంత మేర అవకతవకలు జరిగాయి అనే విషయాన్ని ఆడిట్ పూర్తి అయిన తర్వాత తెలుసుకొని వివరాలు వెల్లడిస్తామని ఆయన వెల్లడించారు. బ్యాంకులో క్యాషియర్ గా పని చేస్తున్న రవీందర్ అందుబాటులో లేని కారణంగా పూర్తి విషయాలు చెప్పలేకపోతున్నామని ఆయన వివరించారు.








