• క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదు, సమన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు.
• అవసరమైన ప్రభుత్వ అనుమతి లేదని స్పష్టం.
ఢిల్లీ, మహా.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లఖ్‌నవూ మేజిస్ట్రేట్ కోర్టులో కొనసాగుతున్న క్రిమినల్ పరువు నష్టం కేసును సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ కేసులో రాహుల్‌కు జారీ చేసిన సమన్లను కూడా రద్దు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతి పొందినట్లు ఎలాంటి ఆధారం లేదని పేర్కొంటూ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
రాహుల్‌గాంధీ 2022 నవంబరు 17న మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం ప్రారంభమైంది. సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేశారని, వారి నుంచి పెన్షన్ తీసుకున్నారని రాహుల్ వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సావర్కర్‌ను అవమానించేలా ఉన్నాయని ఆరోపిస్తూ నృపేంద్ర పాండే అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ కోర్టును ఆశ్రయించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన లఖ్‌నవూ మేజిస్ట్రేట్ కోర్టు 2024 డిసెంబరు 12న రాహుల్‌గాంధీకి సమన్లు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాహుల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే 2025 ఏప్రిల్ 4న సమన్లను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దిగువ కోర్టు ఉత్తర్వులను పునఃసమీక్షించేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 397 కింద సెషన్స్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సూచించింది.
హైకోర్టు తీర్పుపై రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 2025 ఏప్రిల్ 25న దిగువ కోర్టులో కొనసాగుతున్న విచారణపై స్టే విధించింది. అదే సమయంలో సావర్కర్‌తోపాటు దేశం కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులపై భవిష్యత్తులో అవమానకరమైన లేదా వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని రాహుల్‌ను హెచ్చరించింది. ఇలాంటి వ్యాఖ్యలను పునరావృతం చేస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం అప్పట్లో స్పష్టం చేసింది.
అయితే తాజాగా కేసు విచారణలో కీలకమైన న్యాయపరమైన లోపం బయటపడింది. రాహుల్‌పై క్రిమినల్ చర్యలు కొనసాగించేందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ అలాంటి అనుమతి మంజూరైనట్లు ఎలాంటి వివరాలు లేవని ధర్మాసనం గుర్తించింది. అవసరమైన అనుమతి లేకపోతే క్రిమినల్ విచారణ కొనసాగించలేమని స్పష్టం చేస్తూ ఫిర్యాదు, మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లను కొట్టివేసింది.
ఈ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతంలో రాహుల్‌గాంధీ పిటిషన్‌ను వ్యతిరేకించింది. కేసు ఫైలు, సాక్షుల వాంగ్మూలాలు, దర్యాప్తు నివేదికను పరిశీలించిన తర్వాతే మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. రాహుల్ వ్యాఖ్యలు ముందస్తు ప్రణాళికతో సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేసేలా ఉన్నాయని ఆరోపించింది. అలహాబాద్ హైకోర్టు ఆయనకు ఉపశమనం నిరాకరించడం చట్టబద్ధమేనని వాదించింది.
మరోవైపు కేసు విచారణకు పలుమార్లు గైర్హాజరైన నేపథ్యంలో రాహుల్‌గాంధీకి లఖ్‌నవూ కోర్టు గతంలో రూ.200 జరిమానా విధించిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదు, సమన్లనే కొట్టివేయడంతో ఆ కేసులో రాహుల్‌కు తక్షణంగా భారీ న్యాయపరమైన ఉపశమనం లభించింది.
తాజా తీర్పుతో సావర్కర్ వ్యాఖ్యలపై లఖ్‌నవూలో కొనసాగుతున్న క్రిమినల్ పరువు నష్టం చర్యలకు ముగింపు పడింది. అయితే సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా రాహుల్‌ను స్వాతంత్య్ర సమరయోధులపై వ్యాఖ్యల విషయంలో హెచ్చరించిన అంశం మాత్రం న్యాయపరమైన రికార్డులో కొనసాగుతోంది. తాజా నిర్ణయం ప్రధానంగా అవసరమైన ప్రభుత్వ అనుమతి లేకపోవడంపై ఆధారపడి ఉందని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి.







