భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి(BRS) విలీనం అవుతుందంటూ వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆయన ఘాటుగా స్పందించారు.
నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వారు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ తమదని చెప్పారు. అన్నీ దాటుకొని నిబద్ధత, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్అని చెప్పుకొచ్చారు.
సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్ర భాగాన నిలిపినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినట్లు కేటీఆర్ వివరించారు. కోట్లాది గొంతుకలు, హృదయాలు, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం చేస్తున్న పోరాటం వల్లే సాధ్యమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఎప్పటిలానే బీఆర్ఎస్తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని, పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలు, దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ‘పడతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం! కాని తల వంచం. ఎప్పటికైనా, ఎన్నటికైనా! జై తెలంగాణా!’ అంటూ కేటీఆర్ తన ట్వీట్‌ను ముగించారు. కాగా, బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందంటూ పలు మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న క్రమంలో కేటీఆర్ ఈ మేరకు తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది.







