- మందమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ జాగరూకత దివాస్
- బెల్లంపల్లి ఏసీపీ, మందమర్రి సీఐ ల వెల్లడి
మందమర్రి, మహా : డిజిటల్ ప్రపంచంలో విద్యార్థులకు అప్రమత్తత అవసరమని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి లు వాక్యానించారు. గురువారం మందమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “సైబర్ జాగరూకత దివాస్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక యుగంలో యువతరం ఇంటర్నెట్ వాడకంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. సైబర్ నేరగాళ్లు అమాయకులను ఎలా టార్గెట్ చేస్తున్నారో విద్యార్థులకు వివరించారు. అదేవిందగా ఈ అవగాహన విషయాలను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు పంచుకోవాలని తద్వారా అందరికీ అవగాహన కలుగుతుందని ఏసిపి పేర్కొన్నారు. పార్ట్-టైమ్ జాబ్ స్కామ్‌లు సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపించి, మొదట చిన్న మొత్తంగా డబ్బులు చెల్లించమని కోరి, చివరకు పెద్ద మొత్తంలో పంపించాలని మోసం చేయడం పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ అపరిచితులు ప్రభుత్వ అధికారులుగా, పోలీసులగా ఫోన్ చేసి, లీగల్ చిక్కులు, అరెస్టుల పేరుతో బెదిరించి, డబ్బులు డిమాండ్ చేయడం ఈమధ్య మామూలు అయిపోయిందని చెప్పుకొచ్చారు. అనతికాలంలోనే అధిక రాబడి ఇస్తామని నమ్మించి, నకిలీ క్రిప్టో, షేర్ మార్కెట్ పథకాలలో పెట్టుబడులు పెట్టించడం కూడా మోసాలలో భాగమేనని గ్రహించాలని వివరించారు. ఆన్లైన్లో తప్పుడు కస్టమర్ కేర్ నంబర్‌ను వెతికి, మోసగాళ్లకు ఓటిపి, వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చి నష్టపోరాదని చెప్పారు. విద్యార్థులకు నేటి తరుణంలో ఎక్కువగా జరుగుతున్న సైబర్ నేరాల గురించి, అపరిచితుల నుండి వచ్చే లింకులు, కాల్స్, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవ్వరికీ ఇవ్వొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్.ఐ. రాజశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్, పోలీస్ సిబ్బంది సైతం విద్యార్థులలో డిజిటల్ భద్రతపై మరింత అవగాహన కల్పించారు. ఎలాంటి మోసం జరిగినా ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.







