Mahaa Daily Exclusive

  సినీరంగాన్ని బలోపేతం చేస్తున్న మంత్రి కోమటి రెడ్డి…..

Share

  • సినీరంగాన్ని బలోపేతం చేస్తున్న మంత్రి కోమటి రెడ్డి
  • యువ ప్రతిభకు వేదికలుగా మూడు ప్రధాన కార్యక్రమాలకు ఆమోదం
  • టెలివిజన్, యంగ్ ఫిలిం మేకర్స్ అవార్డ్స్ కోసం కమిటీలు ఏర్పాటు
  • సినీ,టెలివిజన్ రంగాల అభివృద్ధికి రూ.30 లక్షల నిధుల మంజూరు

హైదరాబాద్, మహా : రాష్ట్ర ప్రభుత్వం సినీ, టెలివిజన్ రంగాల అభివృద్ధి దిశగా మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలు రాష్ట్రంలో సృజనాత్మక రంగానికి ఊతమివ్వడంతో పాటు యువ ప్రతిభకు వేదికలు కల్పించడమే లక్ష్యంగా ఉన్నాయి.

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎప్ డీసీ) ద్వారా హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 19 నుంచి 21, 2025 వరకు దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిలిం స్టడీస్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ కార్యక్రమం కోసం రూ.30 లక్షల నిధులు కార్పొరేషన్ ప్రస్తుత బడ్జెట్ నుండి కేటాయించింది. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సూచనల మేరకు ఈ ఫెస్టివల్‌కు అవసరమైన ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. “ఈ ఫెస్టివల్ రాష్ట్ర యువ దర్శకులు, సినీ విద్యార్థులు తమ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు వేదిక అవుతుంది,” అని మంత్రి పేర్కొన్నారు.

టెలివిజన్ అవార్డ్స్ – నిబంధనల రూపకల్పనకు కమిటీ

‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024’ నిర్వహణకు సంబంధించిన నియమాలు, విధానాలు, లోగో డిజైన్ వంటి అంశాలను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టెలివిజన్ రంగానికి చెందిన ప్రముఖులు, సీనియర్ ప్రొఫెషనల్స్ సభ్యులుగా ఉన్నారు. ఈ అవార్డులు రాష్ట్ర టెలివిజన్ రంగంలో సృజనాత్మకత, సామాజిక స్పృహ, నాణ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహించేలా ఉండేలా రూపొందించనున్నట్టు మంత్రి తెలిపారు.

యంగ్ ఫిల్మ్ మేకర్స్ అవార్డ్స్ – యువ ప్రతిభకు గుర్తింపు

యంగ్ ఫిల్మ్ మేకర్స్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం కోసం రూ.30 లక్షల బడ్జెట్ కేటాయించింది. ఈ కమిటీలో దర్శకుడు హరీష్ శంకర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, సినిమాటోగ్రాఫర్ పి.జి. విందా, దర్శకుడు బలగం వేణు వంటి సినీ రంగ ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఈ అవార్డుల ద్వారా యువ దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

సృజనాత్మక రంగానికి ప్రాధాన్యం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ “సిఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సినీ మరియు టెలివిజన్ రంగాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. తెలంగాణలోని యువ ప్రతిభకు అవకాశాలు కల్పించటం, సృజనాత్మకతకు ప్రోత్సాహం ఇవ్వటం, ఫిలిం ఇండస్ట్రీకి అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేయటం మా లక్ష్యం. తెలంగాణను భారతదేశంలో సృజనాత్మకతకు కేంద్రంగా నిలబెట్టేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయి,” అని అన్నారు

Latest