- అందెశ్రీ అస్తమయం
- తెలంగాణ జయకేతనం సాహితీశిఖరం
- గుండెపోటుతో హఠాన్మరణం
- ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం
- తెలంగాణ సాహితీశిఖరం నేలకూలింది- సీఎం రేవంత్ దిగ్భాంత్రి
- నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
హైదరాబాద్, మహా
తెలంగాణ సాహితీశిఖరం నేలకూలింది. జయజయహే తెలంగాణ అంటూ రాష్ట్రగీతంతో ఉద్యమానికి ఊతమిచ్చిన ప్రజాకవి.. జనజాతరలో మనగీతం అంటూ ప్రజలను ఏకం చేసిన గొంతుక.. సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా ఎదిగి …. తెలంగాణ సాంస్కృతిక స్వరవాహికగా మారిన నిప్పుల వాగు అందెశ్రీ ఇక లేరు. ప్రముఖ కవి, రచయిత అందె శ్రీ (64) కన్నుమూశారు. హైదరాబాద్ లాలాగూడలోని తన ఇంట్లో సోమవారం ఉదయం అస్వస్థతకు గురి కాగా, కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హాస్పిటల్‌కు తీసుకొచ్చేలోపే అందెశ్రీ మృతి చెందినట్లుగా వెల్లడించారు. ఇంట్లోనే తుది శ్వాస విడిచారని స్పష్టం చేశారు. అందెశ్రీ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
చదువు లేకుండానే కవి
1961 జులై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించిన అందెశ్రీ, భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశారు. పాఠశాల విద్య లేకుండానే కవిగా రాణించిన అందెశ్రీ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ‘మాయమైపోతున్నడమ్మా-మనిషన్నవాడు’ గీతంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది. ఇటీవలే ఆయనకు రూ.కోటి పురస్కారం అందించింది. ఆశు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. కాకతీయ యూనివర్సిటీ ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 2006లో గంగ సినిమాకు నంది పురస్కారం గెలుచుకున్నారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ పొందారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం వరించింది.
అందెశ్రీతో సీఎంకు ప్రత్యేక అనుబంధం
అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీలోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందె శ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.







