Mahaa Daily Exclusive

  రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం…

Share

  • రాజస్థాన్‌లో
  • రాకాసి ఇసుక తుపాను బీభత్సం
  • పగలే చీకటిమయం, జీరో విజిబిలిటీ

జైపూర్, మహా : ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో శనివారం మధ్యాహ్నం ప్రకృతి ప్రకోపించింది. ఒక్కసారిగా ముంచెత్తిన భారీ ఇసుక తుఫాను (బవండర్) రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. ముఖ్యంగా చురూ, బికనేర్, శ్రీగంగానగర్ జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది.

పగటిపూటే నల్లటి చీకట్లు

మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆకాశమంతటా దాదాపు కిలోమీటరు ఎత్తున దట్టమైన నలుపు, పసుపు రంగు ఇసుక మేఘాలు కమ్మేసాయి. సుమారు అరగంట పాటు ఇసుక తుఫాను వీధులన్నింటినీ చుట్టుముట్టేసింది. దీంతో కంటిచూపు ఆనని (జీరో విజిబిలిటీ) పరిస్థితి ఏర్పడి, పగటిపూటే దట్టమైన చీకటి అలుముకుంది. రహదారులపై వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది.

కొట్టుకుపోయిన ఇళ్ల పైకప్పులు

గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన ఈదురు గాలుల వల్ల పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు, రేకులు కొట్టుకుపోయాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో రవాణా, విద్యుత్ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగింది. తీవ్రమైన ఎండలు, హీట్‌వేవ్‌లతో తల్లడిల్లుతున్న ప్రజలకు ఈ తుఫాను భయాందోళనలు కలిగించినప్పటికీ, దీని తర్వాత కురిసిన వర్షం వల్ల ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గాయి. ధోల్‌పూర్ పరిధిలోని బారిలో గరిష్టంగా 58 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.

రాబోయే రోజుల్లో అలర్ట్

పశ్చిమ విక్షోభం ప్రభావం వల్ల రాబోయే మరికొద్ది రోజుల పాటు రాజస్థాన్‌లోని జైపూర్, అజ్మీర్, కోట, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ డివిజన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు, వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని జైపూర్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు స్పష్టం చేశారు.