Mahaa Daily Exclusive

  పసిడికి ‘పన్ను’ సెగ….

Share

పసిడికి ‘పన్ను’ సెగ.
* దేశంలో 70 శాతం పడిపోయిన బంగారం డిమాండ్‌.
*దిగుమతి సుంకం 6 నుంచి 15 శాతానికి పెంపు.. పన్నుల భారం రెట్టింపు.
* రెండు వారాల్లో 25 టన్నుల నుంచి 7.5 టన్నులకు పడిపోయిన విక్రయాలు.
*ఆకాశాన్నంటిన ధరలు.. 10 గ్రాముల బంగారం ఏకంగా రూ.1.57 లక్షలు.
*లైట్‌వెయిట్ నగల వైపు కస్టమర్ల మొగ్గు.. పాత బంగారం అమ్మేందుకు జనం క్యూ.
ముంబై, మహా.
దేశంలో పసిడి ప్రియులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు వీలుగా బంగారం దిగుమతులపై సుంకాలను భారీగా పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం.. దేశీయంగా పసిడి మార్కెట్‌ను కుదిపేసింది. పన్నుల భారం రెట్టింపు కావడం, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో నిత్యావసరాల ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు ఒక్కసారిగా నానాటికీ దిగజారాయి. కేవలం రెండు వారాల వ్యవధిలోనే పసిడి డిమాండ్ ఊహించని విధంగా ఏకంగా 70 శాతం మేర పడిపోవడం వ్యాపార వర్గాలను కలవరపెడుతోంది.
**రెట్టింపైన పన్నుల భారం.. వెలవెలబోతున్న షాపులు**
రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడానికి, క్రూడాయిల్ ధరల పెరుగుదల వల్ల తగ్గుతున్న విదేశీ మారక నిల్వలను సర్దుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ డ్యూటీ (దిగుమతి సుంకం)ని 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచింది. దీనికి జీఎస్‌టీ కూడా తోడవడంతో.. అంతకుముందు పసిడిపై ఉన్న మొత్తం పన్ను భారం 9.18 శాతం నుంచి ఒకేసారి 18.45 శాతానికి చేరింది. ఈ పన్నుల పెంపు దెబ్బకు దేశవ్యాప్తంగా జువెలరీ దుకాణాలు వెలవెలబోతున్నాయని ‘ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్’ (IBJA) వెల్లడించింది. గతేడాది మే నెల చివరి రెండు వారాల్లో దేశంలో 25 టన్నులుగా ఉన్న బంగారం డిమాండ్.. ఈసారి కేవలం 7.5 టన్నులకే పరిమితమైంది. ముఖ్యంగా దేశీయ మార్కెట్‌లో 65 శాతం వాటా ఉన్న అసంఘటిత రంగానికి చెందిన చిన్న వ్యాపారులు ఈ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతున్నారు.
**మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిన ప్రధాని పిలుపు..**
పన్నుల పెంపుతో పాటు ఈ ఏడాది బంగారానికి వీలైనంత దూరంగా ఉండాలంటూ దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను గట్టిగా దెబ్బతీసింది. ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో మధ్యతరగతి కుటుంబాలు పసిడి కొనుగోళ్లను పూర్తిగా పక్కనబెట్టేశాయి. ప్రస్తుతం ముంబై స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.1.57 లక్షల రికార్డు స్థాయికి చేరడం గమనార్హం.
**లైట్‌వెయిట్ నగలకు క్రేజ్.. పాత బంగారం విక్రయాలు షురూ!**
ధరలు సాధారణ ప్రజల అందుబాటులో లేకపోవడంతో కొనుగోలుదారులు తమ వ్యూహాన్ని మార్చారు. బడ్జెట్‌కు తగినట్లుగా తక్కువ క్యారెట్ కలిగిన, తేలికపాటి (లైట్‌వెయిట్) నగల కొనుగోలుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు, మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, అత్యవసర నగదు కోసం తమ వద్ద ఉన్న పాత నాణేలు, నగలను అమ్మి క్యాష్ చేసుకునేందుకు జనం జువెలరీ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. పాత బంగారం మార్పిడి, అమ్మకాలు మార్కెట్‌లో ఒక్కసారిగా జోరందుకున్నాయి.