సిరిసిల్ల, మహా
‘వర్కర్ టు ఓనర్’ అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని సంక్రాంతి లోపలే వెంటనే అమలు చేయాలని సిరిసిల్ల శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తూ, పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొని, సంక్రాంతి లోపలే ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని ప్రారంభించాల్సిందే అని స్పష్టం చేశారు.
ఈ పథకం సమర్థవంతంగా అమలవ్వాలంటే, గతంలో రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా పవర్ లూమ్‌లను సబ్సిడీపై కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులను వచ్చే బడ్జెట్‌లో పూర్తిస్థాయిలో కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే సంక్రాంతి లోపలే ఆసాముల లిస్టును ఫైనల్ చేసి, అర్హులైన నేత కార్మికులకు లెటర్లు కేటాయించాలి అని కోరారు. ఒకవేళ సంక్రాంతి లోపల ఈ ప్రక్రియ పూర్తిచేయకపోతే, సంక్రాంతి అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ, నేత కార్మికులందరినీ సమీకరించి ఆందోళనకు దిగుతామన్నారు.








