- ప్రవాస భారతీయులు సాంస్కృతిక వారధులు
- వివిధ దేశాలతో సత్సంబంధాలకు కీలకంగా నిలుస్తున్నారు
- మాతృదేశం రుణం తీర్చుకోవాలి
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- సింగపూర్ లో తెలుగు ప్రజలతో మాటామంతి
సింగపూర్, మహా : ప్రవాస భారతీయులు తమ నైపుణ్యం, కష్టపడే తత్వంతో ప్రపంచవ్యాప్తంగా వెలుగులు పంచుతున్నారని, వారే మన భాషా సంస్కృతులను విశ్వవ్యాప్తం చేసే నిజమైన సాంస్కృతిక వారధులని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బుధవారం రామకృష్ణ మిషన్ లోని శారదా హాల్‌లో నిర్వహించిన ‘మాటా-మంతీ’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు మాట్లాడుతూ.. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న 32 మిలియన్ల భారతీయులు ‘వసుధైవ కుటుంబం’ అనే తత్వానికి సార్థకత చేకూరుస్తున్నారు. ప్రపంచంలో వివిధ దేశాలతో చక్కని బంధం ఏర్పడడంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమైనది. వాణిజ్య బంధాలు, చాలా సమయాల్లో సాంస్కృతిక బంధాలుగా మారతాయి. మీలాంటి వారంతా కలిసి ఈ ప్రపంచాన్ని ఒకటే కుటుంబంగా మార్చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా భారతదేశమే. ఈ భావన మానవాళి పురోగతికి దోహదం చేస్తుంది.” అని చెప్పారు.
ఏ దేశమేగినా, ఎందు కాలిడినా మన తల్లి గడ్డ భారత భూమిని, మన జాతి గౌరవాన్ని నిలబెట్టాలన్న రాయప్రోలు సుబ్బారావు గారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ మనసులో నింపుకోవాలని శ్రీ వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. “భాషా సంస్కృతులను కాపాడుకునే దిశగా ప్రవాస భారతీయుల నుంచి నేను ఆకాంక్షిస్తున్న చొరవ ఇదే. ప్రాచీనమైన, విశిష్టమైన మన తెలుగు భాషకు పట్టం కట్టాలి. వచ్చే తరాలు మన భాషతో మమేకమయ్యేలా తీర్చిదిద్దాలి” అని పిలుపునిచ్చారు.
గత 30 ఏళ్లుగా సింగపూర్‌లోని తెలుగు వారి సంస్కృతికి చిరునామాగా నిలుస్తోందని సింగపూర్ తెలుగు సమాజం సేవలను ఆయన అభినందించారు. సాహిత్య, సాంస్కృతిక, విద్య, సామాజిక, దాతృత్వ కార్యకలాపాల ద్వారా తెలుగు వారిని ఏకతాటిపైకి తీసుకొస్తోందని సంస్థ చొరవను కొనియాడారు. సంక్రాంతి వంటి పండుగలు నిర్వహించడంతో పాటు, ‘తెలుగు బడి’ ద్వారా ఇక్కడి పిల్లలకు మాతృభాషను నేర్పుతున్న విధానం ముదావహమని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో కలిసి నిర్వహిస్తున్న కార్యక్రమాలు భాషా సంస్కృతులను కాపాడుకునే దిశగా చక్కని ముందడుగు అని అభివర్ణించారు. మన కట్టు, బొట్టు, యాస, ప్రాస, పద్యం, గద్యం మరియు జానపద గీతాలు మన సంప్రదాయాలకు ప్రతీకలని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకూడదని సూచించారు.
భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని పేర్కొంటూ, విదేశాల్లో కష్టపడి సంపాదించిన వారు తిరిగి సొంత గడ్డకు వచ్చి సేవ చేయాలని, జన్మభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. హాజరైన వారందరికీ 2026 నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.








